కాంగ్రెస్ పార్టీ నేత పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని, చంద్రబాబుతో ఆత్మీయతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన ఆమె .. తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టడం ఎందుకన్న చర్చ ప్రారంభమయింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి. రాజకీయాలను రాజకీయాలుగా చేస్తూ పట్టు పెంచుకున్నారు. పార్టీలు మారడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. సుదీర్గ కాలం టీడీపీలో ఉండి అనేక పదవులు అనుభవించిన ఆయన కుటుంబం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ మంత్రిగా చేసినా.. ఓ సారి ఓడిపోవడంతో ఇబ్బంది పడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నా.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆపేశారు.
కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీలో చేరారు. ఆయన భార్య సునీత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఘోరంగా ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. హఠాత్తుగా చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. టీడీపీలో చేరే అంత సాహసం చేయరని..కానీ ఏదో రాజీకయ వ్యూహాన్ని ఆశించే ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ టీడీపీ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారని మాత్రం ఊహిస్తున్నారు