ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం తన పోరాటం ఆగదని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రత్యేక హోదా కోసం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తిరుపతి సభలో తన కార్యచరణను సుమారుగా చెప్పిన జనసేన అధినేత.. ఆ సభ అనంతరం ఏపీవాసులకు ఆశలు పెంచారనే చెప్పాలి! అనంతరం కాకినాడలోనూ పవన్ కల్యాణ్ సభ జరిగింది. ఆ సభలో పవన్ కళ్యాణ్ ఏమి చెప్పాలనుకున్నారు, ఏమి చెప్పారు అనే విషయాలకంటే… “పాచి పోయిన లడ్డూలు” బాగా ఫేమస్ అయ్యింది. ఇదే క్రమంలో తాజాగా మూడో సభకు సంబందించిన డిటైల్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ఈ సభలో కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు జనసేన నేతలు.
నవంబర్ 10న అనంతపురంలో తలపెట్టిన బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త భాష్యం చెప్పారు. అనంతపురంలో జరిగే ఈ సభకు “సీమాంధ్ర హక్కుల చైతన్య సభ” అని పవన్ నామకరణం చేశారని, ఇదే క్రమంలో ఈ సభ జరిగే మైదానానికి, సభా వేదికకు జనసేన పేర్లు పెట్టింది. ఈ సభ నిర్వహణకు కావలసిన ఏర్పాట్ల గురించి తెలియజెప్పిన ఈ పత్రికా ప్రకటనలో జనసేనాని అంతరంగాన్ని పార్టీ ఆవిష్కరించింది. సభ జరిగే మైదానానికి అనంతపురం జిల్లా ముద్దుబిడ్డ, విప్లవనేత స్వర్గీయ “తరిమెల నాగిరెడ్డి ప్రాంగణం” గాను, సభావేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ దురంధుడు స్వర్గీయ “కల్లూరు సుబ్బారావు వేదిక” గానూ నామకరణం చేసినట్లు వెల్లడించింది.
అనంతపురం జిల్లాలో జన్మించి రాష్ట్రానికి, దేశానికి అపారమైన సేవలందించిన మహనీయులులను ఈ విధంగా స్మరించుకోవడం జనసేన భాగ్యమని పవన్ కల్యాణ్ భావించి ఈ మేరకు పేర్లు ఖరారు చేసినట్లు జనసేన ప్రకటన వివరించింది. కాగా, నవంబర్ 10న సాయంత్రం నాలుగు గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరగనుంది. దీంతో సభ నిర్వహణ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చురుకుగా ఏర్పాటు చేస్తున్నారని జనసేన వివరించింది.