జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత వినూత్నంగా, అర్థవంతంగా నిర్వహించారు. ఆర్భాటపు వేదికలు, భారీ హోర్డింగులు, డీజేల హోరుకు దూరంగా.. పచ్చని ప్రకృతి ఒడిలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల మధ్య ఈ వేడుకలు జరిగాయి. పాడేరు నియోజకవర్గంలోని ఓనూరు, నందిగరువు వంటి గ్రామాల్లో గిరిపుత్రులతో మమేకమై, స్వయంగా పార్టీ జెండాను ఆవిష్కరించి పవన్ కళ్యాణ్ తన నిరాడంబరతను చాటుకున్నారు.
కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఈ పర్యటనను ప్రగతి ప్రణాళికల పరిశీలన కు వేదికగా మార్చుకున్నారు. పీఎం జన్ మన్ పథకం కింద నిర్మించిన రోడ్లను సుమారు 2.4 కిలోమీటర్ల మేర కాలినడకన పర్యవేక్షించి, పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ అందుతున్న తాగునీటి సౌకర్యాన్ని బిందెతో నీటిని పట్టి మరీ పరీక్షించారు. మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన బిడ్డలతో కలిసి ప్లకార్డుల ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఓనూరులోని అంగన్వాడీ కేంద్రం, మండల ప్రాథమిక పాఠశాలలను సందర్శించి చిన్నారులకు స్టేషనరీ కిట్లు, గర్భిణులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. పాఠశాల భవనాల మరమ్మతులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, కొత్తపొలం వంటి గ్రామాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యాలను స్పాట్లోనే మంజూరు చేసి తనదైన ప్రజా పాలన ను రుచి చూపించారు. గిరిజనుల వినతులను స్వీకరిస్తూ, ఇది కూటమి ప్రభుత్వం.. సమస్య చెబితే వేధించే రకం కాదు, పరిష్కరించే ప్రభుత్వం అని వారికి భరోసా ఇచ్చారు.
గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి , యువతకు ఉపాధి పెంచేందుకు సరికొత్త ప్రణాళికలను అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్లకు ఇరువైపులా పండ్ల తోటల పెంపకం, బ్యాంబూ కాటేజీల నిర్మాణం ద్వారా గిరిజనుల ఆదాయం పెంచాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవం అంటే కేవలం సంబరం మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే బాధ్యత అని నిరూపిస్తూ పవన్ కళ్యాణ్ సాగించిన ఈ మన్యం పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.


