ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ కారణంగా అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరు కావడం లేదు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సిన కీలక అంశాల దృష్ట్యా ఈ పర్యటన ఖరారు కావడంతో, ఆయన ఈ భేటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు, రైల్వే ప్రాజెక్టుల పురోగతి, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలలో ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర పెద్దలతో సమావేశం కావడమే ప్రాధాన్యతగా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేయనున్నారు.
కేంద్ర హోంమంత్రితో అపాయింట్ మెంట్ చాలా కాలం తర్వాత ఖరారు కావడంతో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అదేసమయంలో కేబినెట్ భేటీ కూడా ఉండటంతో.. తన ఢిల్లీ పర్యటన గురించి పవన్ ముందుగానే సీఎంకు సమాచారం ఇచ్చారు.
