జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి చాలా పెద్ద రాజకీయ సంకటం ఎదురైనట్టే. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా విడిపోయాక పెట్టిన పార్టీ ఆవిర్భావ సభతో పాటు, రాజధాని రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం, అలాగే ప్రత్యేక హోదా కోసం అంటూ ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఏర్పటు చేసుకున్న ఏ సభ విషయంలోనూ పవన్‌కి ఇంతటి సంకట స్థితి రాలేదు. ఏం మాట్లాడాలనే విషయంలో ముందుగానే పూర్తి క్లారిటీ ఉండేది. అయినప్పటికీ ఆవిర్భావ సభ విషయం పక్కన పెడితే రీసెంట్గా పవన్ పాల్గొన్న ప్రత్యేక హోదా పోరాట సభలతో సహా చాలా బహిరంగ సభలలో పవన్ ఉపన్యాసాలలో క్లారిటీ మిస్సవుతూ వస్తోంది. పవన్‌కి ఏవైనా ఇబ్బందులున్నాయా? లేక అధికార పార్టీలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితుల్లో పవన్ ఉన్నాడా? అన్న అనుమానాలు రేకేత్తేలా ఉన్నాయి. ఇంతకుముందు ఏర్పాటు చేసిన సభలలో బిజెపి నాయకులు, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళను కాస్త గట్టిగానే విమర్శించిన పవన్ చంద్రబాబు, మోడీల విషయానికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంతో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉన్న యువత అంతా కూడా నమో జపం చేస్తోంది. పవన్ అభిమానుల్లో ఎక్కువ మంది ఈ యువతే.
మరి ఇప్పుడు పవన్ ఎలా రియాక్టవుతాడు? బహిరంగ సభలో ఏం మాట్లాడతాడు? చంద్రబాబు, మోడీలను విమర్శించే ధైర్యం చేస్తాడా? నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని విమర్శిస్తే ప్రతివిమర్శలు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న యువతలో ఎక్కువ శాతం మంది ఇప్పుడు మోడీని విమర్శించేవాళ్ళపైన కాస్త గట్టిగా….ఘాటుగా ఎదురుదాడి చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు సభలలో చంద్రబాబుని విమర్శించే ధైర్యం పవన్‌కి లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి. ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ జగన్‌కి దక్కకుండా చేయడం కోసమే పవన్ కళ్యాణ్‌ని ఆయుధంగా వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపించాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతోంది? చంద్రబాబు, మోడీలను విమర్శిస్తాడా? నోట్లను రద్దు చేసినందుకు మోడీని అభినందిస్తున్నా. కానీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం మాత్రం ఆపేది లేదని అంటాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోడీ మోసం చేశాడని చెప్తాడా? మరీ ముఖ్యంగా ఇంతకుముందు సభలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్‌పైన వెంకయ్యతో సహా చాలా మంది టిడిపి నాయకులు కూడా సెటైర్స్ వేశారు. వాటన్నింటికీ ఇఫ్పుడు పవన్ ఇవ్వబోయే సమాధానం ఎలా ఉంటుందో చూడాలిమరి.