జనసేన అధినేత పవన్ కల్యాణ్… పిఠాపురం ఆడపడుచులకు తోడబుట్టిన అన్నలా మారారు. ప్రతి పండుగకు వారిని నేరుగా పలకరించకపోయినా .. తన తరపున వారికి అన్నలా కానుకలు పంపుతున్నారు. ఈ సారి పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతాల సందర్భంగా ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ, చీరలు కానుకగా అందిస్తున్నారు. వీటిని పవన్ కల్యాణ్ తన సొంత డబ్బులతో సమకూర్చుతున్నారు. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నిర్వహించనున్న వరలక్షీ వ్రత ఏర్పాట్లపై ఆలయ అధికారులు, పోలీసు అధికారులు జనసేన నాయకులతో చర్చించారు.
పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఏటా జరిగే విధంగానే సంప్రదాయబద్దంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించి ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీర కానుకగా అందించాలని నిర్ణయించారు. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమవుతాయి. మొత్తం 5 బ్యాచులుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరు నామకరణం చేసి.. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఒక ఆర్డర్ ప్రకారం నిర్వహిస్తారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం విజయంలో మహిళలది కీలక పాత్ర. అందుకే పవన్ గెలిచినప్పటి నుండి శాంతిభద్రతలను కాపాడటం.. అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ అధికారులకు బాధ్యతలు ఇచ్చి పనులు చేయిస్తున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.