జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎ్మమెల్యేలతో ముఖాముఖి సమావేశం అవుతున్నారు. ఉదయం నుంచి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. అందరితో ఒకే సారి కాకుండా.. ఒక్కొక్కరిని పిలిచి పూర్తి స్థాయిలో పనితీరును సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొంత టైం తీసుకుని అయినా అందరితోనూ మాట్లాడుతారని జసేన వర్గాలు అంటున్నాయి.
మొదటగా మండలి బుద్ధప్రసాద్ తో మాట్లాడారు. తర్వాత దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సిహెచ్ వంశీ కృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వారి నియోజకవర్గంలో ఏడాదిన్నర పాటు చేయలేని పనులను గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందుబాటులో ఉన్నా ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంచేయడం వల్ల జరగని పనుల గురించి పవన్ ఎక్కువగా ప్రస్తావించారని అంటున్నారు.
అత్యధిక మంది ఎమ్మెల్యేలు కూటమితో సఖ్యతగా ఉండటం లేదు. తమదే రాజ్యం అన్నట్లుగా ఉంటున్నారు. కూటమి నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను కూడా వారికి వివరించి కారణాలు అడిగనట్లుగా చెబుతున్నారు. నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజక వర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు అన్నింటిపై సమాచారం తెప్పించుకుని మరీ పవన్ ప్రశ్నిస్తూండటంతో .. ఎమ్మెల్యేలు సమాధానాలు చెప్పుకోలేక నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. మరో వైపు పవన్ నామినేటెడ్ పోస్టులు పొందిన వారితోనూ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.
