ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పర్యటించారు. 2022 నవంబరులో అప్పటి ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లను కూల్చివేసినప్పుడు, పవన్ కల్యాణ్ బాధితులకు అండగా నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని ఇచ్చిన హామీ మేరకు, నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన గ్రామానికి వెళ్లారు.
ఈ పర్యటనలో ప్రధానంగా బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలిని పవన్ కల్యాణ్ కలిశారు. గత పర్యటనలో ఆమె పవన్ను తన సొంత బిడ్డలా భావించి, కన్నీరు పెట్టుకుంటూ తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆనాడు ఆమెకు ధైర్యం చెప్పిన పవన్, ఇప్పుడు అధికారంలో ఉండి ఆమెను పలకరించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ పర్యటన మాత్రమే కాదని, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో పవన్ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, ఆయన మంగళగిరి హైవేపై సుమారు మూడు కిలోమీటర్లు నడిచి ఇప్పటం చేరుకున్నారు. ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో పవన్ కారు పైకి ఎక్కి చేసిన ప్రసంగం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున మొత్తం 53 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు కూడా నాగేశ్వరమ్మ కుటుంబానికి మరికొంత ఆర్థిక సాయం అందించారు.
