రాజకీయ పార్టీలకు ఆడియో సాంగ్స్, వీడియో ఆల్బమ్స్ హడావుడిని అప్పట్లో తెలుగుదేశం మొదలుపెట్టింది. అదే ట్రెండును చాలా పార్టీలు ఫాలో అయిపోయాయి. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ మరో కొత్త ట్రెండ్ తీసుకొస్తోంది! రాజకీయ పార్టీలకు టీజర్లు కూడా పెట్టొచ్చని పవన్ నిరూపించారు. జనసేన పార్టీ తరఫున ఒక టీజర్‌ను ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ టీజర్లో ఒక పేద్ద వేదికా… మధ్యలో జనాల ఫొటోలు దర్శనమిస్తాయి. ఇంకోపక్క సోషల్ మీడియాలోకి కూడా జనసేన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ల ద్వారా ఇకపై జనసేన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలనుకుంటున్నారు. పైపై హంగులు బాగానే ఉన్నాయి. కానీ, వీటిన్నింటికంటే ప్రధానంగా జరగాల్సింది పార్టీ నిర్మాణం! ఇంతవరకూ పవన్ కల్యాణ్‌కు అభిమానులు మాత్రమే ఉన్నారు. వీరిని అధికారికంగా జనసేన కార్యకర్తలుగా మార్చితేనే పార్టీకి ఉపయోగం. క్యాడర్ నిర్మాణం చేయాలి. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయుల్లో పార్టీ నిర్మాణం జరగాలి.
అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఫోకస్ సినిమాల మీద ఉంది. సినిమాలతోపాటు రాజకీయాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తా అంటున్నారు. అయితే, రెండో పడవ ప్రయాణం కొనసాగించాలంటే చేయాల్సినవి చాలానే ఉన్నాయి. ముందుగా ఆంధ్రా ప్రత్యేక హోదాపై మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగించాలి. మూడు అంచెల్లో ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామన్నారు. కానీ, తిరుపతి, కాకినాడ రెండు సభల తరువాత ఆ ఉద్యమం దశాదిశా ఏంటనేది ప్రశ్నార్థకంగానే ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమించి కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామన్నారు. కానీ, జనసేన తదుపరి కార్యాచరణ ఏంటనేది ఇంకా స్పష్టత లేదు.
నిజానికి, ఈ ఉద్యమాన్నే ఒక అవకాశంగా మార్చుకుంటే పార్టీ నిర్మాణం కూడా జరిగిపోతుంది కదా! దశలవారీగా ఉద్యమ కమిటీలు వేసి… జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటుపై దృష్టి పెడితే ఉద్యమం తీవ్రత మరోలా ఉంటుంది. పార్టీగా జనసేన ప్రజలకు మరింత చేరువైనట్టు అవుతుంది. కానీ, ఇవన్నీ వదిలేసి కేవలం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి షేర్ చేస్తే చాలు, ప్రజలు కనెక్ట్ అయి ఉంటారని అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు! ఈ విషయాన్ని ఇప్పటికైనా జనసేన అధినేత తెలుసుకుని… పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడితే బాగుంటుందని జనసేన అభిమానులు పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటి నుంచే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ప్రారంభం కావాలి. లేదంటే, గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. సంస్థాగత నిర్మాణం లేకపోతే జనాల్లో ఎంత క్రేజ్ ఉన్నా ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారిపోతుందీ అనడానికి ప్రజారాజ్యం అనుభవమే ఒక గొప్ప ఉదాహరణ!