పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రెండేళ్ళు పైనే అవుతునప్పటికీ ఇంతవరకు పార్టీ కార్యవర్గాన్ని, జిల్లలువారిగా కమిటీలని నియమించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులే జనసేన కార్యకర్తలలాగ వ్యవహరిస్తున్నారు. అయితే కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జనసేన పార్టీ పేరుతో పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం, వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాలు తెలియజేయడం వంటివి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. అందుకే జనసేన తరపున మాట్లాడేందుకు ఎవరినీ అధికార ప్రతినిధులుగా నియమించుకోలేదని, ఒకవేళ నియమించుకొంటే ఆ విషయం జనసేన లెటర్ హెడ్ మీద తను స్వయంగా సంతకం చేసి మీడియాకి తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వచ్చే నెల 8న కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కనుక ఆలోగా గానీ లేదా అదేరోజున గానీ పార్టీ కార్యవర్గాన్ని లేదా అధికార ప్రతినిధుల పేర్లని ఖరారు చేసే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికలలో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లే కనబడుతోంది కనుక వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ తన పార్టీని నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ఎన్నికల కోసం కాకపోయినా, ప్రత్యేక హోదా కోసం జిల్లా స్థాయి నుంచి పోరాటాలు చేస్తామని చెపుతున్నారు కనుక దానిని విజయవంతం చేయడానికైనా పార్టీని నిర్మించుకోవలసిన అవసరం చాలా ఉంది. లేకుంటే జనసేన పట్ల, పవన్ కళ్యాణ్ పోరాటం పట్ల ప్రజలకి నమ్మకం కుదరడం కష్టమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలాబలాలు, సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఏవిధంగా ఇతర పార్టీల నేతలు చిరంజీవి రాజ్యంలో చేరడానికి క్యూలో నిలబడ్డారో ఇప్పుడూ అదేవిధంగా వచ్చే ప్రయత్నం చేయవచ్చు. కానీ అటువంటి అవకాశవాదులైన రాజకీయ నేతలని పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకొంటారా లేకపోతే కేవలం అభిమానులకే ప్రాధాన్యత ఇస్తారా? అనేది మరికొన్ని రోజులలోనే తేలిపోవచ్చు.