పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం నిర్మాత. `విరూపాక్ష` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ని పునః ప్రారంభించారు. ఈరోజు నుంచి షూటింగ్ కి బ్రేక్. మళ్లీ 20 రోజుల తరవాత.. షూటింగ్ ప్రారంభిస్తారు. విరూపాక్షని 2021లో తీసుకొచ్చే ఉద్దేశాలు లేవట. ఈ సినిమాని 2022 సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్.
క్రిష్ పనితీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన పనిలో వేగం ఉంటుంది. `గౌతమి పుత్ర శాతకర్ణి` లాంటి సినిమానే 80 రోజుల్లో పూర్తి చేశారు. కాకపోతే.. `విరూపాక్ష`ని టైమ్ తీసుకోవాలని భావిస్తున్నాడు క్రిష్. ఈ సినిమా విషయంలో ఎలాంటి హడావుడీ ఉండకూడదన్నది ఆయన ఉద్దేశ్యం. పైగా ఈసినిమాకి వీఎఫ్ఎక్స్ పనులు చాలా కీలకం. అవి సరిగా లేకపోతే.. సీన్లన్నీ తేలిపోతాయి. అందుకే… వీఎఫ్ఎక్స్‌కి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నాడు. సంక్రాంతికి పవన్ సినిమా వస్తే.. అభిమానులకు పెద్ద పండగే. పైగా.. భారీ వసూళ్లని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. `విరూపాక్ష` అనేది క్రిష్ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా. భారీ బడ్జెట్ సినిమా. అందుకే… సంక్రాంతినే ఈ సినిమాకి సరైన సమయం అని క్రిష్ భావిస్తున్నాడు. ఈ యేడాది ఎలాగూ వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల ఉంటుంది. కాబట్టి క్రిష్ నుంచి సినిమా రాలేదన్న లోటూ ఉండదు. కాబట్టే.. క్రిష్ ఇలా ప్లాన్ చేశాడట.