పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. సమావేశం నుంచి ఆగ్రహంతో మధ్యలోనే వెళ్లిపోయారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ నేతల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో నిర్వహించిన ఈ సర్వసభ్య సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఆ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ విషయంలో ఇంతటి అపచారం జరిగినా, దానిపై ప్రత్యర్థి పార్టీలు ఎదురుదాడి చేస్తున్నా మన నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు.
ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా? నేనే స్పందించాలా? ఇక మీరెందుకు? అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు కూటమి ప్రభుత్వంపై, తనపై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నా, కనీసం వాటిని ఖండించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోందని, పదవులు వచ్చిన తర్వాత నేతల్లో నిర్లిప్తత పెరిగిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారిని అదే స్థాయిలో ఎదుర్కోవాల్సిన బాధ్యత నేతలపై ఉందని స్పష్టం చేశారు. అరవ శ్రీధర్ అంశంపైనా మండిపడ్డారు. కష్టపడి పార్టీని నిర్మించుకున్నామని నాశనం చేస్తామంటే ఊరుకునేది లేదని నష్టం చేశారు.
సమావేశం జరుగుతుండగానే పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెళ్లే ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతి నేత పనితీరుపై, వారు చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు..సామాజిక మాధ్యమాల్లో .. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నారు అనే అంశాలపై ఆరా తీయాలని చెప్పారు.