పవన్ కల్యాణ్ అభిమానులకు మాట్లాడుకోవడానికి బోలెడన్ని కబుర్లు. ఎందుకంటే `కాటమరాయుడు` ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. త్రివిక్రమ్ సినిమా త్వరలోనే మొదలైపోతుంది. ఈలోగా నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. పవన్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చట్లకు కొదవుండదు. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలున్నాయి. కాబట్టి సినీ సంగతులకు పుల్‌స్టాప్ కూడా పెట్టలేం. ఇది పవన్ సినిమాకి సంబంధించిన మరో తాజా కబురు. పవన్ – నేసన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్ ఇది. కథ రెడీ అయిపోయింది. సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఇప్పుడు కథానాయికనీ ఎంచుకొన్నారని టాక్ వినిపిస్తోంది. పవన్ సరసన సాయేషా సైగల్ని తీసుకొన్నారని తెలుస్తోంది.
అఖిల్ తొలి చిత్రం అఖిల్‌తో ఎంట్రీ ఇచ్చిన భామ సాయేషా. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచీ… ఈ కథానాయిక పేరు తలచుకోవడమే మానేశారు తెలుగు సినీ జనాలు. ఎట్టకేలకు ఈ అమ్మడికి పవన్ సినిమాలో ఆఫర్ దొరికింది. నిజంగా సాయేషాకు ఇది ఊహించని అవకాశమే. అగ్ర కథానాయికలంతా వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల.. సాయేషాని ఎంచుకోవాల్సివచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్, నేసన్ సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకొంటాయని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.