సినిమా ధియేటర్లలో ప్రేక్షకులకు లభిస్తున్న సౌకర్యాలు, వారు పెడుతున్న డబ్బులకు తగ్గట్లుగా న్యాయం చేస్తున్నారా లేదా అన్న అంశంపై తనిఖీలకు పవన్ కల్యాణ్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ రెడ్డి ధియేటర్లలో తనిఖీలు చేయించి సీజ్ చేయించిన అంశాన్ని గుర్తు చేస్తూ.. అప్పుడు జగన్ రెడ్డి చేస్తే తప్పు.. ఇప్పుడు చేస్తే ఒప్పు అని విమర్శలు చేస్తున్నారు. రూల్స్, పాటించేలా చేయడానికి తనిఖీలు నిర్వహించడానికి.. కక్ష సాధింపు, టాలీవుడ్ ను కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడానికి చేసే తనిఖీలకూ చాలా తేడా ఉంటుంది.
జగన్ రెడ్డి చేసిన తనిఖీలు పూర్తిగా కక్ష సాధింపు కోసమే. పవన్ కల్యాణ్ సినిమాలను ఆపాలని, వాటికి ఆర్థిక నష్టం కలిగించాలన్న లక్ష్యంతో జగన్ రెడ్డి అధికారుల్ని ఉసిగొల్పారు. సినిమాలను ప్రదర్శించే ధియేటర్లను చిన్న చిన్న కారణాలతో సీజ్ చేయించారు. టిక్కెట్ ధరలను పది రూపాయలుగా ఖరారు చేసి.. అధికారులను దగ్గర పెట్టి అమ్మించారు. ఆ ఘటనల గురించి మర్చిపోని వాళ్లు చాలా మంది ఉంటారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ధియేటర్ల లీజ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రేక్షకుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ.. వారికి చట్టపరంగా కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించకపోవడం, తినుబండారాల పేరుతో చేస్తున్న దోపిడీని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా ఒక్కటే రిలీజ్ కావడం లేదు. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక వేళ నిజంగా పవన్ కల్యాణ్ ధియేటర్లను టార్గెట్ చేస్తే నష్టపోయేది ఆయనే కదా. అయినా ధరలు పెంచేందుకు ఆసక్తి చూపే ప్రతి నిర్మాత.. ఎగ్జిబిటర్ ఖచ్చితంగా ధియేటర్లో తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలని పవన్ సంకల్పించారు.
ధియేటర్లను చిన్న చిన్న కారణాలతో సీజ్ చేసి అప్పట్లో జగన్ రెడ్డి తన అధికారాన్ని చూపించారు. ఇప్పుడు పవన్ తన అధికారాన్ని బాధ్యతగా ఉపయోగిస్తున్నారు. ఇద్దరికీ చాలా తేడా ఉంది.