ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఫోకస్ సినిమాల మీద కూడా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఓజీ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ ఆయనకు బాగా నచ్చింది. అందుకే సినిమాలను కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఓజీ యూనివర్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓ సినిమా తీసే అవకాశం ఇచ్చారు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు రెడీ అవుతున్నాయి. అంటే పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలనూ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. రెండు పడవలపై ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యారు.
డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాలు చేయడంపై ఇప్పటికే వివాదం
ఎమ్మెల్యేగా ఉంటూ సినిమాలు చేయడం వేరు. కానీ డిప్యూటీ సీఎంగా ఉంటూ సినీ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగించడం మాత్రం విమర్శలకు గురవుతోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ప్రజలు పెద్దగా ఈ విషయంపై వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే అవి ఆయన డిప్యూటీ సీఎం కాక ముందు ప్రారంభించినవి. వాటి ప్యాచ్ వర్క్‌లు పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేయిస్తున్నారు. అయితే ఇలా చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమని కోర్టుల్లో పిటిషన్లు పడుతున్నాయి. అది చట్టపరంగా విరుద్ధం కాకపోవచ్చు కానీ.. నైతికత ఏది అన్న ప్రశ్న మాత్రం వస్తుంది.
ప్రజలకు సమయం కేటాయించడం తగ్గిపోతుంది!
సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తే ప్రజలకు కేటాయించే సమయం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆయన చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తేనే రాజకీయంగా సర్వైవ్ అవుతారు. డిప్యూటీ సీఎం పెద్దగా పాలనను పట్టించుకోవడంలేదని.. ఆయన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ప్రజలు అనుకుంటే.. అది రాజకీయంగా తీవ్రంగా నష్టపరుస్తుంది. ప్రజలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనకు వస్తే ఆ నేతను కూడా పట్టించుకోవడం మానేస్తారు.
కొత్త సినిమాలు చేయకపోవడమే మంచిది !
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించిన సినిమాలను పూర్తి చేస్తే ప్రజలు ఆక్షేపించరు. అందుకే వైసీపీ సపోర్టర్ అయిన ఓ ఐఏఎస్ కోర్టుకెళ్తే ఆయనకు ఎక్కడా మద్దతు లభించలేదు. కానీ కొత్త సినిమాలు ప్రారంభిస్తే మాత్రం ప్రజల పట్ల పవన్ నిజాయితీని ప్రశ్నించేవారు పెరిగిపోతారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయంగా ఆయనకు సలహాలు ఇచ్చేవారు ఉన్నారో లేరో … విజయం ఇస్తున్న కిక్ అద్భుతంగా ఉందని కంటిన్యూ చేయాలనుకుంటున్నారేమో కానీ …రెండు పడవలపై ప్రయాణం ఎప్పటికైనా ప్రమాదకరమే.