కొండగట్టు గిరి ప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అంతా సమష్టిగా స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్దామని పవన్ కల్యాణ్ తెలంగాణ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం కొండగట్టులో అంజన్నకు నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసారు
రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందన్నారు. 2024 ఎన్నికల ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులు, ఆంజనేయస్వామి మాల ధరించి వస్తున్న స్వాములు పడుతున్న ఇబ్బందులను ఆలయ అధికారులు ఆయన దృష్టికి చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చొరవతో టీటీడీ ధార్మిక మండపాల నిర్మాణాల నిమిత్తం వెచ్చిస్తున్న నిధుల నుంచి రూ.35.19 కోట్లను కొండగట్టు ఆలయంలో సత్రం, దీక్షల విరమణ మండపాలను నిర్మించేలా కేటాయించింది.
నేను గతంలో కొండగట్టు సందర్శించినపుడు అర్చకులు అప్పట్లో సత్రం కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉన్నాం. ఈ అభివృద్ధి పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నాను. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి టీటీడీ బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందని పవన్ తెలిపారు. పవన్ పర్యటనకు పెద్ద ఎత్తున అభిమానలు, భక్తులు తరలి వచ్చారు.
