ఉప్పాడ తీరంలో ఇటీవల మత్స్యకారులు చేసిన ఆందోళనల సమయంలో తాను స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన పిఠాపురం వెళ్లారు. మొదట.. కలెక్టరేట్లో మాట – మంతి కార్యక్రమం నిర్వహించారు. తర్వాత బహిరంగసభలో మాట్లాడారు.
మత్స్యకారులు తెలియచేసిన ప్రతి సమస్యను, వారి అభిప్రాయాలను అర్ధం చేసుకుని 100 రోజుల లోపు పరిష్కారానికి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా కాలుష్య పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. మత్స్యకారులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఉప్పాడ రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని మత్స్యకారులకు తెలిపారు.
పారిశ్రామికవేత్తలను బెదిరించలేమని .. అలా చేస్తే వారు తలా పదివేలు ఇచ్చి వెళ్లిపోతారన్నారు. కానీ సమస్య పరిష్కారం కాదన్నారు. మత్య్సకారులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.. వ్యర్ధాలు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడికే బోటులో వస్తానని మీకు న్యాయం చేయనప్పుడు రాజకీయాలను వదిలేసి వెళ్తానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ పర్యటన మత్స్యకారుల్లో సంతృప్తిని మిగిల్చింది.