ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తి సాము కళ అయిన కెంజుట్సు లో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన కొనసాగిస్తున్న క్రమశిక్షణతో కూడిన సాధన, పరిశోధన , అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ అరుదైన ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. జపాన్ వెలుపల ఈ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది భారతీయుల్లో పవన్ ఒకరిగా నిలిచారు.
మార్షల్ ఆర్ట్స్ పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను గుర్తిస్తూ, జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సోగో బుడో కన్రి కై సంస్థ ఆయనకు ఫిఫ్త్ డాన్ పురస్కారాన్ని అందజేసింది. అంతేకాకుండా, జపాన్ వెలుపల టకెడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. దీనితో పాటు గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కరించింది.
సినిమాల్లోకి రాకముందే చెన్నైలో కరాటే , ఇతర యుద్ధకళల్లో కఠిన శిక్షణ పొందిన పవన్, కేవలం శారీరక సాధనకే పరిమితం కాకుండా జపనీస్ సమురాయ్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో కెండో లో ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని, తాత్విక అవగాహనను పెంపొందించుకున్నారు. తన సినిమాలైన తమ్ముడు, ఖుషి, అన్నవరం , తాజా చిత్రం ఓజీ ద్వారా ఈ యుద్ధకళలకు ఆయన విస్తృత ప్రచారం కల్పించారు.
నటుడిగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ వేదికపై భారతీయ ప్రతిభను చాటారు. కెంజుట్సులో ఆయనకు లభించిన ఈ గౌరవం కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, ఆయన జీవితకాల సాధన , క్రమశిక్షణకు దక్కిన ప్రతిఫలం. సినిమా, యుద్ధకళలు మరియు యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ సమన్వయం చేసిన అరుదైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు.