నిర్మాత ఏఎం రత్నం ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. రత్నం పేరుని ఈ పదవి కోసం ప్రతిపాదించినట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన ‘వీరమల్లు’ ప్రెస్ మీట్ లో పవన్ ఈ విషయమై మీడియాకు లీక్ తానే అందించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ముఖ్యమంత్రి టేబుల్ పై ఉంది. ఆయన సంతకం పెడితే… ఏఎం రత్నానికి పదవి దక్కినట్టే.
రత్నం అంటే పవన్‌కు ప్రత్యేకమైన అభిమానం. ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని పవన్‌కు అందించారాయన. ఇప్పుడు ‘వీరమల్లు’కూ ఆయనే నిర్మాత. ”నాతో సినిమాలు తీశారని కాదు. ఏఎంరత్నం చాలామంది పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. ఆయనకు మంచి అనుభవం వుంది” అని పవన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జెంటిల్మెన్, భారతీయుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు రత్నం. వెండి తెరకు భారీదనాన్ని పరిచయం చేసిన నిర్మాతల్లో ఆయన ఒకరు. నిర్మాణ రంగంలో ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. దర్శకుడు కూడా. ‘పెద్దరికం’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. ఆయనలో ఓ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ కూడా దాగి ఉన్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎఫ్డీసీ ఛైర్మన్ గా రత్నం పేరు పవన్ ప్రతిపాదించారు.
”అన్నీ నా చేతుల్లో లేవు. నేను రత్నం పేరు ప్రతిపాదించాను అంతే.. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సివుంది” అని పవన్ ముక్తాయించారు. పవన్ చెబితే.. జరక్కుండా ఉంటుందా? పైగా సినీ పరిశ్రమకు సంబంధించిన లోతుపాట్లన్నీ పవన్ కు తెలుసు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా జనసేన నుంచి ఎన్నికైన వారే. కాబట్టి రత్నం ఎఫ్డీసీ ఛైర్మన్ అవ్వడం లాంఛన ప్రాయమే.