జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించడం ప్రారంభించారు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు తమదైన ముద్ర వేయడానికి కావాల్సినంత సమయం తీసుకున్నట్లే. మరి వారు తమ పని తాము చేశారా.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అందుకుంటున్నారా.. కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అన్నదానిపై సమీక్ష చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. వారినికి కనీసం ఇద్దర్ని పిలిచి సుదీర్ఘంగా సమీక్ష చేసి.. లోపాలను, తప్పులను ఎత్తి చూపి మెరుగవ్వాలని సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజుతో ప్రారంభించారు.
జనసేన ఎమ్మెల్యేల పనితీరు మెరుగ్గా ఉండాలని పవన్ భావన
ఎమ్మెల్యేల విషయంలో మరో కూటమి పార్టీ టీడీపీ పక్కా ఎసెస్మెంట్ చేసుకుంటోంది. దారి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది.. వారి విధుల గురించి వారికి పక్కా క్లారిటీ ఇస్తోంది. నిర్లక్ష్యం చేస్తే వెంటనే హెచ్చరికలు వెళ్తున్నాయి. తమ ఎమ్మెల్యేల పని తీరు విషయంలోనూ పవన్ కల్యాణ్అంతే సీరియస్ గా ఉండాలనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యే ల పనితీరుపై సమగ్రమైన రిపోర్టు తెప్పించుకుని సమీక్ష చేపడతున్నారు. జనసేన ఎమ్మెల్యేలు.. తమ వ్యక్తిగత రాజకీయాలు చేయడం కాకుండా… ప్రజా కోణంలో.. రాష్ట్రం కోణంలో రాజకీయం చేయాలని పవన్ కోరుకుంటున్నారు.
ప్రజాసమస్యలకు ప్రథమ ప్రాధాన్యం
పవన్ కల్యాణ్ ఇటీవల పోలవరం మండలంలో పర్యటించారు. అక్కడ కొంత మంది తమ గ్రామానికి రోడ్డు సమస్య ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకురావడం బాగానే ఉంది కానీ.. అప్పటి వరకూ సమస్యను ఎమ్మెల్యే ఎందుకు గుర్తించలేక పోయారన్న ప్రశ్న పవన్ కు వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు కానీ.. ఇలా గ్రామాలకు సంబంధించి ప్రజలందరికీ ఉపయోగపడే సమస్యలను మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలన్నది పవన్ పాలసీ. ఇలాంటి సమస్యలను గుర్తించడంలో ఎమ్మెల్యేలు సీరియస్ గా ఉండాలని.. వాటిని పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని రివ్యూలో చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు సరైన ట్రాక్‌లో ఉండేలా పవన్ ప్రయత్నాలు
కొంత మంది జనసేన ఎమ్మెల్యేలు కూటమి ధర్మాన్ని విస్మరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదటి సారి అధికారంలోకి రావడంతో చాలా మంది ఎమ్మెల్యేలకు తమకంటే ఎవరూ గొప్ప కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో కొంత మంది పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు నామినేటెడ్ పోస్టులకు సిఫారసు చయడంలో వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటినీ సరిదిద్దేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు.. సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.
