పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత చెప్పాల్సిన సందర్బం వస్తే పవన్ కల్యాణ్ వదిలి పెట్టడం లేదు. సందర్భాన్ని వెదుక్కుని మరీ సాయం చేస్తున్నారు. శుక్రవారం టీచర్స్ డే సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లకు కానుకలు పంపించారు. ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు , స్వీట్స్ పంపించారు. మొత్తం రెండు వేల మంది వరకూ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ కానుకలు అందేలా చూశారు.
పవన్ ఇలా ప్రజలకు కృతజ్ఞతగా కానుకలు పంపించడం ఇదే మొదటి సారి కాదు. ప్రతీ సారి సందర్భం వస్తే చాలు కొత్తబట్టలు పంపుతున్నారు. ఇటీవల శ్రావణమాసం వ్రతాల సందర్భంగా ఆలయాల్లో పదివేల చీరలతో పాటు పసుపు, కుంకుమ పంపారు. అంతకు ముందు రాఖీ సందర్భంగా నియోజకవర్గంలో వితంతువులకు, ఒంటరి మహిళలకు అన్నగా అండగా ఉంటానని రాఖీ కానుక పంపారు. అంతే కాదు పవన్ కల్యాణ్ తన జీతం మొత్తాన్ని పిఠాపురంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇచ్చేస్తున్నారు. ప్రతి నెలా వారికి ఐదు వేలు అందేలా ఏర్పాటు చేశారు.
డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ .. పిఠాపురం విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటున్నారు. ప్రత్యేక టీమ్‌ను పిఠాపురానికి కేటాయించారు. వారు ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయడం దగ్గర నుంచి ప్రజల సమస్యలను తీర్చడం వరకూ అన్నింటిలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు.


