హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఆయన దేశవ్యాప్తంగా హిందువులను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉందని తాజాగా ఆయన హిందీ, ఇంగ్లిష్, తెలుగుభాషల్లో ట్వీట్ చేశారు.
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు,మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని.. తగిన ఫలితం అనుభవిస్తారని అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని.. ఇది ఖచ్చితంగా మారాల్సి ఉందన్నారు.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేస్తున్నప్పుడు.. మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు. కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమేనన్నారు.
తిరుమల లడ్డూలో అసలు నెయ్యి లేకుండా కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా.. వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ అంశంపై దేశవ్యాప్త ఉద్యమం అవసరం అని పవన్ భావిస్తున్నారు.


