జనసేన నేతలు ఎవరూ సెటిల్మెంట్లు చేయవద్దని అధినేత పవన్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పదవి-బాధ్యత కార్యక్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన వారందరితో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు ఇచ్చారు. సెటిల్మెంట్లు చేస్తే వైసీపీ నేతలకు మనకూ తేడా ఉండదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సహించే ప్రశ్నే ఉండదని తేల్చి చెప్పారు.
పదవి అనేది అధికారం చెలాయించడానికి కాదు, ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు ఎదురొడ్డి, పోలీసులు కొడుతున్నా పార్టీ జెండాను వదలకుండా పోరాడిన ఒక సామాన్య మహిళకు పదవి ఇవ్వడం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. పదవి చిన్నదైనా, పెద్దదైనా దానికి ఒక గౌరవం ఉంటుంది. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అందరూ అత్యంత బాధ్యతగా పనిచేయాలన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలని అనేక సామాజిక వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రెల్లి సామాజిక వర్గం కోసం కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్యులకు కూడా పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో సముచిత స్థానం కల్పించామని, ఇది నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
జాతీయ దృక్పథంతో కూడిన ప్రాంతీయ పార్టీని నడపాలనే లక్ష్యంతోనే జనసేనను స్థాపించాననని దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుంటూనే, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటమే జనసేన సిద్ధాంతమని పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వంతో కాకుండా, విశాల దృక్పథంతో ప్రజలందరినీ కలుపుకుని పోవాలని నేతలకు పిలుపునిచ్చారు. పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్నది తన ఆలోచన అన్నారు.


