మిడిమిడి జ్ఙానంతో పెద్ద పెద్ద విషయాలపై మాట్లాడొద్దు పవన్

మాటలతో మంటలు రాజేయడంలో మన రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా? దేశ సమగ్రత కోసం ప్రాణాలిస్తాం, దేశం కోసం పాటుపడతాం అని బోలెడన్ని కబుర్లు చెప్తారు కానీ రాజకీయ స్వార్థం విషయానికొచ్చేసరికి ఆ కబుర్లన్నింటినీ గాలికొదిలేస్తారు. దేశాన్ని తగలెట్టి చలిమంట కాచుకునే దగుల్బాజీ పనులకు దిగుతారు. ఇలాంటి నాయకులకు మన దేశంలో కొరత లేదు. అన్ని పార్టీల్లోనూ భారీ సంఖ్యలోనే ఉన్నారు. పాకిస్తాన్ సమర్థిస్తూ మాట్లాడిన నేతలు ఎందరో. అలాగే దేశంలో అశాంతి రగిలేలా, కులాల మధ్య, మతాల మధ్య గొడవలు రేగేలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన నాయకులు కూడా ఉన్నారు. అలాగని ఈ బాపతు నాయకులకు ఆ కులం అంటేనో, మతం అంటేనో అభిమానం ఉందని అనుకోవడానికి అస్సలు లేదు. దశాబ్ధాలుగా ఓట్లేసి గెలిపిస్తున్న పాతబస్తీ ప్రజలను అభివృద్ధి చేసే సత్తా ఉండదు కానీ ఐదు నిమిషాలు టైం ఇస్తే ఏదో పీకేస్తా అన్న ఒవైసీ బ్రదర్‌ గురించి మనకు తెలిసిందేగా. బిజెపితో సహా అన్ని పార్టీలలో ఉన్న అలాంటి నాయకుల కథ అంతా కూడా సేం టు సేం.

ఇప్పుడు పవన్ కూడా అదే కేటగిరీలో చేరాడు. తరుణ్ మాట్లాడిన మాటలు కచ్చితంగా తప్పే. అందులో సందేహం లేదు. కానీ ఎవరో ఒకరు తప్పుగా మాట్లాడరని చెప్పి మొత్తం ఉత్తర భారతదేశానికే ఆ తప్పును ఆపాదించడం చాలా పెద్ద తప్పు. మరీ కేసీఆర్‌ చెప్పుకున్న స్థాయిలో లక్షల సంఖ్యలో పుస్తకాలు చదువుతానని చెప్పకపోయినా…. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటానని చెప్పుకుంటూ ఉంటాడు పవన్. మరి అన్ని పుస్తకాలు చదువుతున్న పవన్‌కి విశాల దృక్పథంతో ఆలోచించడం అలవాటు కాలేదా? లేకపోతే ఇమేజ్ కోసం బుక్స్ చదువుతానని చెప్పి బిల్డప్స్ ఇస్తున్నాడా?

నిధులు ఖర్చు చేసే విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. కానీ దానికి కారణం ఎవరు? సమైక్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని చెప్పి కేసీఆర్‌తో సహా తెలంగాణాలో ఉన్న నాయకులందరూ చెప్తూ ఉంటారు. అందుకు కారణం ఎవరు? తెలంగాణా నాయకులే. మంత్రి పదవుల కోసం కక్కుర్తి పడి…సొంత నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తకుండా పడి ఉన్న బానిస నాయకులదే ఆ తప్పు. అలాగే దక్షిణ భారతదేశం మొత్తం విషయం పక్కన పెట్టి…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకూ చూసుకుంటే ఎపికి నిధులు రావడం లేదు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు అంటే కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేసినా, ఏమీ చేయకపోయినా కూడా ఇక్కడ మోడీ భజన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్న ఈనాడు మీడియా ఏం చేస్తోంది? మోడీ అజెండా ప్రకారం పని చేయడం లేదా? ప్రత్యేక హోదా విషయంలో ఒక్కసారి అయినా మోడీని తప్పుబట్టగలిగిందా మన భజన మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఊపిరికి ఊపిరి అల్లుకుని బ్రతికేస్తున్నాను అనే రేంజ్‌లో చెప్పుకునే చంద్రబాబు ఏం చేస్తున్నాడు? ఓటుకు కోట్లు కేసు కారణం అయితేనేమీ…ఇంకో కారణం అయితేనేమీ …మోడీకి బాహుబలి కట్టప్ప స్థాయి కట్టుబానిసగా లేడా? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ప్రతి వ్యవస్థాపక దినోత్సం రోజు డప్పు కొట్టుకునే చంద్రబాబుకు…పార్లమెంట్ సాక్షిగా తెలుగు ఎంపి అశోక్ గజపతి రాజుపైన దాడి జరిగితే చీమకుట్టినట్టుగా కూడా అనిపించలేదా?

ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో అధికార స్వార్థం లేని పార్టీ ఏదైనా ఉందా? భజన మీడియా, వెంకయ్యలాంటి భజనపరులు నరేంద్రమోడీని దేవుడు అని కీర్తించొచ్చు కానీ మోడీ మాత్రం పదవీ స్వార్థం ఉన్నవాడు కాదా? మరి అలాంటి పార్టీలు, నాయకులు అందరి విధానాలు కూడా ఎలా ఉంటాయి? కెసీఆర్‌కి సీమాంధ్రప్రజలన్నా, సీమాంధ్ర నాయకులు, వ్యాపారస్తులు అన్నా ఏమైనా కోపం ఉంటుందా? కచ్చితంగా ఉండదు. కానీ తెలంగాణా ప్రజల దృష్టిలో హీరో అవ్వాలంటే సీమాంధ్రులను తిట్టాలన్న రాజకీయ స్వార్థం కెసీఆర్‌ది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే కొత్త రాజధాని ఉండాలని చంద్రబాబు పట్టుపట్టడం వెనకాల రాజకీయ స్వార్థం లేదా? తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ప్రజలను ఏ స్థాయిలో అయినా మోసం చేయడానికి, భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి సిద్ధపడే నాయకులు, మీడియా వాళ్ళు మన దగ్గర బొలెడుమంది ఉన్నారు. అలాంటి చాలా మందితో పవన్‌కి ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలాంటివో చూస్తూనే ఉన్నాం. అంతెందుకు ఇప్పుడు దక్షిణ భారతం అని పవన్ కళ్యాణ్ ఎత్తుకుంటున్న పాట వెనకాల రాజకీయ స్వార్థం లేదా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే ఉత్తర భారతం, దక్షిణ భారతం అని భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడు. తప్పు చేస్తున్న మోడీని నిలదీస్తాడు. నరేంద్రమోడీ అండ్ కో చేస్తున్న తప్పులను దక్షిణ భారత ప్రజలకు అర్థమయ్యేలా చేస్తాడు. అలా చేయడమంటే షూటింగ్ గ్యాప్‌లో ట్విట్టర్‌లో కామెంట్ పెట్టినంత ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.

ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే బిజెపి కేంద్ర నాయకులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకూడదు. ఒక్క విషయంలో కూడా రాష్ట్రానికి న్యాయం చేయని నరేంద్రమోడీతో పొత్తును కొనసాగిస్తున్న చంద్రబాబుపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కోపం వచ్చేలా చేయాలి. వాళ్ళను చైతన్య పరచాలి. అన్నింటికీ మించి మోడీ భజన చేస్తున్న మీడియాను బహిష్కరించాలి. పవన్ కళ్యాణ్ లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరోకి ఇలాంటి ప్రయత్నం చేయడం పెద్ద కష్టం కాదు. కానీ చాలా త్యాగాలు చెయ్యాలి. పోరాటానికి సిద్ధం కావాలి. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆవేశం వస్తే ముందు చంద్రబాబు దిగివస్తాడు. మోడీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాన్ని జగన్ విరమించుకుంటాడు. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అవుతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కామెడీ చేస్తున్న నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు దెబ్బకు దిగివస్తారు.

అవన్నీ వదిలేసి ట్విట్టర్‌లో అర్థరహితమైన కామెంట్స్ చేస్తూ ఉంటే మాత్రం జరిగేది ఒక్కటే. ఉస్మానియాలో చదువుకుంటున్న సీమాంధ్ర విద్యార్థులను తెలంగాణా విద్యార్థులు హింసించినట్టుగా…. రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఉత్తర భారత దేశ విద్యార్థులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉత్తర భారతీయులు… మూర్ఖులు, ఆవేశపరులైన కొంతమంది దక్షిణ భారత జనాల చేతిలో మానసిక, శారీరక హింసకు గురయ్యే అవకాశం ఉంది. కానీ దక్షిణాది ప్రజలను మోసం చేసిన, చేస్తున్న ఉత్తర భారతదేశ నాయకులు, ఆ మోసం చేస్తున్న నాయకులకు సపోర్ట్ చేస్తున్న దక్షిణాది నాయకులు, భజన మీడియా జనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.