సినిమా పరిశ్రమ చుట్టూ ‘ఈగో’ వైఫై లా తిరుగుతుంటుంది. ఫాల్స్ ప్రెజ్టేజీ ఎక్కువ. ‘నేనే తోపు’ అనుకొనేవాళ్లు అడుగడుగునా కనిపిస్తారు. కొంత స్టార్డమ్ వస్తే ‘నన్ను మించినోడు లేడు’ అనే అనుకొంటారు. వాళ్లందరి మధ్య పవన్ కల్యాణ్ స్టైల్ వేరు, ఆయన స్థాయి వేరు. ‘పవర్ స్టార్’ అని అని పిలిపించుకోవడం కూడా ఆయనకు ఇష్టం ఉండదు. `నన్ను అలా పిలవకండి` అని చాలాసార్లు అభిమానుల్ని వేడుకొన్నారు. పొలిటికల్ స్పీచులు దంచికొట్టే పవన్.. సినిమా ప్రెస్ మీట్లో మాత్రం చాలా మొక్కుబడిగా మాట్లాడతారు. కొన్నిసార్లు ఆ మాటలు కూడా రావు. ఆయన సింప్లిసిటీ గురించి సినిమా పాత్రికేయులకు బాగా తెలుసు. అది మరోసారి బయటపడింది.
ఈరోజు హైదరాబాద్‌లో ‘హరి హర వీరమల్లు’ ప్రెస్ మీట్ జరిగింది. పవన్ కల్యాణ్ ఈ ప్రెస్ మీట్ కి రావడం, దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడడం ఈ ప్రెస్ మీట్ హైలెట్. అందులో చాలా విషయాలు సినిమా చుట్టూనే తిరిగాయి. మీడియాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు పవన్. కొంతమంది పాత్రికేయుల పేర్లు కూడా ప్రస్తావించారు. మీడియాతో మళ్లీ ఇంట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో అనే అనుమానంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సివచ్చిందని చెప్పుకొచ్చారు పవన్. త్వరలోనే ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తానని ఊరించారు.
ఈ సందర్భంగా పవన్ లోని సింప్లిసిటీ మరోసారి బయటకు వచ్చింది. ‘నేను చిన్న హీరోని. నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా మార్కెట్ తక్కువ. నాకొచ్చే వసూళ్లు తక్కువ’ అని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు వందలు, వేల కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నారు. వాళ్లతో పోలిస్తే ఈ రేసులో పవన్ వెనుకబడిన మాట నిజం. కాకపోతే… పవన్ స్టామినా వేరు. పవన్ సినిమా ఫ్లాప్ అయినా, ఆయన తొలి రోజు వసూళ్లు మిగిలిన హీరోల వీకెండ్ వసూళ్లకు తీసిపోవు. వరుసగా ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా, పవన్ ఎప్పుడూ ఓపెనింగ్స్ లో వెనుకబడలేదు. ఫ్లాప్ సినిమాలకే ఇంత ఉంటే.. పవన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ రాజకీయాలవైపు దృష్టి పెట్టడంతో సినిమాలపై ధ్యాస తగ్గింది. లేదంటే.. ఈపాటికి ఎన్నో అద్భుతమైన కాంబినేషన్లు సెట్ అయ్యేవి.
‘చిరంజీవి కొడుకైనా, తమ్ముడైనా ప్రతిభ ఉంటేనే రాణించగలరు. నాది సంవత్సరంలో ఓ శుక్రవారం మాత్రమే. సంవత్సరమంతా సినిమాలు రావాలంటే మిగిలిన హీరోలు కష్టపడాలి. వాళ్లతో పాటే నేనూ” అని పవన్ మాట్లాడడం కూడా హత్తుకొంది. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే స్టామినా ఉన్న హీరో పవన్. అలాంటి హీరో నుంచి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా చాలు. యేడాదంతా మాట్లాడుకొంటారు. అయినా సరే.. పవన్ ఒదిగి మాట్లాడడం అందరికీ నచ్చింది. ‘నా ఫొటోలు అప్పట్లో వార పత్రికలు ప్రచురించడానికి ఇష్టపడేవి కావు. వాళ్లకు నాపై అంత నమ్మకం ఉండేది కాదు. అలా పబ్లిసిటీ లేకుండానే నా సినిమాలు రిలీజ్ అయ్యేవి. అదే ఇప్పటి వరకూ అలవాటు పడిపోయింది’ అని ఒకప్పటి రోజులు గుర్తు చేసుకొన్నారు పవన్.
మొత్తానికి పవన్ ప్రెస్ మీట్.. అందులో పవన్ మాట్లాడిన మాటలు మీడియా మనసుల్ని గెలుచుకొంది. ”ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు” అని త్రివిక్రమ్ అన్నట్టు.. పవన్‌కి నెగ్గడమే కాదు.. తగ్గడం కూడా బాగా తెలుసు. అందుకు ‘వీరమల్లు’ ప్రెస్ మీట్ ఒక సాక్ష్యం.. అంతే!