పిఠాపురం గడ్డపై సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా పీఠికాపురంలో అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ . ఈ పండుగ ప్రారంభ కార్యక్రమంలో పిఠాపురం గురించి జరుగుతున్న, చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందులలో సొంత బాబాయ్‌ని గొడ్డలితో వేటాడి చంపినా అది కొందరికి వార్తగా కనిపించదు.. కానీ పిఠాపురంలో చిన్న స్కూలు పిల్లలు కొట్టుకున్నా, ఆఖరికి ఇక్కడ ఒక కాకి ఈక పడినా సరే, కొందరు కావాలని భూతద్దంలో చూపిస్తూ నానా గోల చేస్తున్నారు అని మండిపడ్డారు. తన నియోజకవర్గంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా, దాన్ని కావాలని భూతద్దంలో చూపిస్తూ వైరల్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి గొడవలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పిఠాపురం వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఇక్కడే కూర్చుని ఏరివేస్తాను అని కటువుగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం వంటి సంస్కృతి ఉండేదని, మళ్ళీ అలాంటి వాటిని పిఠాపురంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తన మాటలు మెత్తగా ఉన్నప్పటికీ, తాను ఈ విషయాలను చాలా గట్టిగా మరియు పర్సనల్‌గా తీసుకుంటానని పవన్ హెచ్చరించారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని, తనను బలోపేతం చేస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ఇంత కఠినంగా మాట్లాడటానికి కారణాలు ఉన్నాయి. ఇటీవల కొంత మంది వైసీపీ సానుభూతి పరులు యూట్యూబ్ చానళ్ల ముసుగులో అక్కడ కులాల కుపంట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సంబంధం లేని విషయాలకు కులాలు అంటిస్తున్నారు. స్కూలు పిల్లలు కొట్టుకున్నా అదే పనిచేస్తున్నారు. అందుకే పవన్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
