పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అభివృద్ది పేరుతో ప్రజలకు బాధలు కలిగించడం సమంజసం కాదని ఆ బాధిత గ్రామాల ప్రతినిధులతో ఆయన అన్నారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టిలో పడేట్టు చేయడానికి పరిష్కారం సాధించడానికి జనసేనగా తమ వంతు చేయగలిగింది చేద్దామన్నారు. అభివృద్ధి పేరిట అమలు జరిగే విధానాలు ప్రజలు భయపడే పరిస్థితి తీసుకురావడం సరికాదని వ్యాఖ్యానించారట. ఈ పార్కు విషయంలోన చాలాకాలంగా ే వామపక్షాలు ఆ గ్రామాల ప్రజలూ ఆందోళన చేస్తున్నారు. సిపిఎం నాయకులు పి.మధు తదితరులను అరెస్టు చేయడమే గాక పోలీసులు దారుణంగా వ్యవహరించింది కూడా ఇక్కడే.ఈ పార్కు వల్ల 35 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని, తాగు సాగు నీటి వనరులు కలుషితమై జీవితాలే దెబ్బతింటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. చిన్నకారు రైతులు మత్స్కకారులు వ్యవసాయ కార్మికుల జీవనోపాధి గల్లంతవుతుంది. ఈ విషయమై బాధితులు కాకినాడ సభలోనూ పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇప్పుడు వివరంగా నివేదించారు.తాను దీనిపై పర్యావరణ నిపుణులతోనూ అధికారులతోనూ చర్చలు చేస్తున్నట్టు కూడా ఆయన తనను కలిసిన వారితో చెప్పారు.అక్కడ పర్యటించాలన్న విజ్ఞప్తికి కూడా సానుకూలంగా స్పందించారట.రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతంలో భూముల సమీకరణ సమస్యలు స్వయంగా పరిశీలించేందుకు ఆయన వెళ్లడం గుర్తుండేవుంటుంది.
ఇప్పుడు మరోసారి ఆయన భీమవరం వెళ్లవచ్చు. కాటమరాజు సినిమా షూటింగు పెట్టుకున్నా ప్రజల సమస్యలపై వీలైన మేరకు స్పందించడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమాలు తన వృత్తి అనీ, జీవిత వ్యయం కోసం నటిస్తానని ఆయన సూటిగానే చెప్పారు గనక దానికి తప్పుపట్టే అవకాశం లేదు. ఎంపిలు ఎంమ్మెల్యే గాక మంత్రులూ ముఖ్యమంత్రులు కూడా వ్యాపార సంస్థలలో కూరుకుపోయినప్పుడు ఒక నటుడు నటించడాన్ని ఎవరైనా వేలెత్తిచూపడం విడ్డూరంగా వుంటుంది.కాకపోతే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒక్కటే. ఏది ఏమైనా ఆ ఆక్వాపార్కు కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలగా వుంది. ఆయన మొన్న వెలగపూడిలో మాట్లాడినప్పుడు కూడా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరి దానిపై బాధితులను కలుసుకోవడానికి పవన్ కళ్యాన్ సమయమిచ్చారంటేనే కొంత వరకూ ఉద్యమానికి సంఘీభావం తెలిపారన్నమాట. స్వంత జిల్లాలో అందులోనూ అటు బిసిలూ తదితర బడుగు జీవులకూ ఇటు పర్యావరణానికి సంబంధిచిన వివాదం గనక ఆయన చొరవ చూపించేందుకు ఇదే సరైన సమస్యగా భావించవచ్చు కూడా.