ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవరి 3న తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి వెఎళ్లనున్నారు. మార్గశిర పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో చేయనున్న ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సుమారు రూ. 35 కోట్లతో 100 గదుల అత్యాధునిక ధర్మశాలకు భూమిపూజ చేయనున్నారు. ఒకేసారి 2,000 మంది భక్తులు హనుమాన్ దీక్షను విరమించేలా భారీ మండపాన్ని నిర్మించనున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నారు.
పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో తన ప్రచార రథం ‘వారాహి’కి ఇక్కడే వాహన పూజ నిర్వహించి ఎన్నికల సమరాన్ని ప్రారంభించారు. 2009లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో అంజన్నే తన్ను కాపాడారని పవన్ గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రంపై ఆయనకు ప్రత్యేకమైన భక్తి ఉంది.
కొండగట్టు అంజన్నపై ఉన్న నమ్మకంతో టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయిస్తున్నారు. ఇది పూర్తిగా అధ్యాత్మిక పర్యటన. టీటీడీ నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అందుకే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. రాజకీయ హడావుడికి దూరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
