ప్రశ్నించడానికే పార్టీపెట్టానని జనాల్లోకి వచ్చారు జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే చాలాకాలంగా రాజకీయాల్లో గెస్ట్ అప్పీరియన్స్ అని విమర్శలు ఎదుర్కొన్న పవన్… ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడంలేదని, ప్రత్యేక ప్యాకేజీ అని రెండు పాచిపోయిన లడ్డూలిచ్చిన అనంతరం తిరుపతిలో బహిరంగ సభతో రాజకీయంగా అభిమానుల్లో ఆశలు పెంచారు! అనంతరం కాకినాడలో నిర్వహించిన సభలో క్లారిటీ మిస్సయ్యిందనే విమర్శలు వచ్చినప్పటికీ తర్వాతి కాలంలో మరిన్ని సభలు నిర్వహించాలని, ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయంగా పవన్ మరిన్ని కీలక అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ నెల 10వ తేదీన అనంతపురంలో జనసేన సభ ఉన్న నేపథ్యంలో జనసేనాని అభిమానులు అంతా ఈ సభపై ఉత్సాహంతో ఉన్నారు! ఈ సభలో పవన్ తన అభిప్రాయాలను వీలైనంత సూటిగా చెప్పబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ తరఫు నుంచి ఇంకో ప్రకటన వెలువడనుందట. అనంతలో 10వ తేదీ సభ తర్వాత గుత్తిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో పవన్ కళ్యాణ్ ముచ్చటించనున్నారు. ఈమధ్య కాలంలో రాజకీయ పార్టీల అధినేతలు విద్యార్థులతో కూడా ప్రత్యేక సభలు నిర్వహించి ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కాలేజీ మీటింగ్ పై వివిధ వర్గాలు అంచనాలు వేసిన నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల అధినేత సుధీర్ రెడ్డి స్పందించారు.
ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు హైదరాబాద్ కు వెళ్లిన సమయంలో అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని గుంతకల్లు నియోజకవర్గంలోని స్థితిగతులను వివరించినట్లు సుధీర్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో గుత్తికి రావాలని జనసేన అధినేతను ఆహ్వానించగా… ఆ ఆహ్వానాన్ని మన్నించిన పవన్ తమ కాలేజీకి వస్తున్నారని తెలిపారు. అంతే తప్ప పవన్ తమ కాలేజీకి హాజరు కావడంలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు పవన్ బహిరంగ సభకు అభిమానులు ఇప్పటినుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 10వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగనున్న ఆ బహిరంగ సభలో వేదిక నుంచి పవన్ మాట్లాడుతారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంత కరువు, సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ స్పందిచనున్నారు!! అయితే ఈ విషయంలో పవన్ సూటిగా, గట్టిగా స్పందిస్తారని.. సన్నాయి నొక్కులు నొక్కరని అభిమానులు ఆశిస్తున్నారు!!