పవన్ కల్యాణ్‌ని తక్కువ అంచనా వేయకూడదు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన ప్లానింగులు ఆయనకున్నాయి. అందులో భాగంగానే త్రివిక్రమ్ సినిమాని ఓ అస్త్రంగా ఎంచుకొన్నాడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. పవన్ – త్రివిక్రమ్‌ల కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలొచ్చాయి. ఇవి పక్కా కమర్షియల్ కథలు. వీళ్ల కాంబోలో హ్యాట్రిక్ మూవీ మొదలైంది. ఈసారి మాత్రం `దేశభక్తి` అనే పాయింట్‌తో రాబోతున్నారు ఈ మిత్రులిద్దరూ.
పవన్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా ఈ స్క్రిప్టు రెడీ అవుతోందని, సమకాలీన సమాజంలోని సమస్యల్ని కథాంశంగా తీసుకొని, అందులోంచి పుట్టుకొచ్చిన నాయకుడుగా కథానాయకుడి పాత్రని తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ తన భావజాలాన్ని డైలాగులు రూపంలో పేల్చడానికి సిద్దమయ్యాడట. ఈసినిమాకి టైటిల్‌గా ఓ జాతీయ నాయకుడి పేరు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బోస్, తిలక్, పటేల్.. ఇలాంటి నాయకుడి పేరు తలచుకొనేలా టైటిల్ డిజైన్ చేయించాలన్న ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.
అంతేకాదు.. 2017 ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు పొలిటికల్ సెటప్‌ని పెంచుకోవడానికి ఇలాంటి కథలే ఎంచుకొన్నాడు. పవన్ కూడా సరిగ్గా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడన్నమాట. నిజానికి వీరిద్దరి కాంబోలో `కోబలి` అనే సినిమా పట్టాలెక్కాల్సింది. అది కమర్షియల్ పాయింటే. అయితే… కోబలి కంటే… పవన్ పొలిటికల్ కెరీర్‌కి హెల్ప్ అయ్యే కథే బెటర్ అన్నది త్రివిక్రమ్ గేమ్ ప్లాన్. పైగా ఆజోనర్లో త్రివిక్రమ్ ఇప్పటి వరకూ సినిమాలేం చేయలేదు. సో.. తనకీ బాగా హెల్ప్ అవుతుందని భావించి.. ఈ తరహా కథ సిద్దం చేశాడన్నమాట. దేశభక్తి తరహా చిత్రాలకు పడనిదెవ్వరు? అయితే ఈసారి ఇటు ప్రేక్షకులు, అటు ఓటర్లూ ఇద్దర్నీ పటాయించడానికి పెద్ద ప్లానే వేశారు వీరిద్దరూ. మరి ఏం జరుగుతుందో చూడాలి.