చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ‘వీరమల్లు’ సినిమాని ఏదోలా ఫినిష్ చేసేశాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు తనపై ఓ పెద్ద బాధ్యత ఉంది. `ఓజీ` రూపంలో. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఓజీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పవన్ పార్ట్ మినహా షూటింగ్ అంతా పూర్తయినట్టే. పవన్ వచ్చి, ఆ మిగిలిన భాగం ఎప్పుడు ముగిస్తాడా? అనేది పెద్ద ఫజిల్ గా మారిపోయింది. ఎట్టకేలకు ఈ రోజు `ఓజీ` షూటింగ్ మొదలైంది. ఈసారి.. సినిమా పూర్తయ్యేంత వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. మధ్యమధ్యలో చిన్న చిన్న బ్రేక్ వస్తే రావొచ్చు. అది పవన్ కల్యాణ్ షెడ్యూల్ ని బట్టి ఆధారపడి ఉంటుంది.
పవన్ ఏకధాటిగా 30 రోజుల పాటు కాల్షీట్లు ఇస్తే ఈ షూటింగ్ పూర్తయిపోయినట్టే. పవన్ కూడా ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ అదే మూడ్ లో ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. ఏకధాటిగా 30 రోజులు డేట్లు ఇవ్వడం పవన్‌కు చాలా కష్టం. కానీ.. రాజకీయంగా తన కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ సినిమాపై ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. పొలిటికల్ గా ఏపీలో ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణమే ఉంది. కాబట్టి ఇది అనువైన సమయం. ‘ఓజీ’ అయిపోతే.. ఆ తరవాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని మొదలెడతారు పవన్. అది కూడా పూర్తయితే పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల్నీ 2025లోనే ఫినిష్ చేయాలన్నది పవన్ ధ్యేయం. అందుకే కాస్త కష్టమైనా సరే.. అటు పాలిటిక్స్, ఇటు సినిమా.. ఇలా రెండు రంగాలకూ న్యాయం చేద్దామని భావిస్తున్నారు. సినిమాలు పూర్తి చేయడం అభిమానుల కోసమే కాదు. ఆ సినిమాల్ని నమ్ముకొన్న నిర్మాతల కోసం కూడా. ఈ మూడు ప్రాజెక్టులూ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాతలపై భారం పెరుగుతుంది. ఆయా సినిమాలు క్రేజ్‌ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పవన్ రంగంలోకి దిగక తప్పడం లేదు. సినిమాలు పూర్తయితే.. ఆ భారం నుంచి పవన్ విముక్తుడు అవుతాడు. ఫ్యాన్స్‌కీ ఆనందమే.