ప‌స‌లేని ప‌వ‌న్ స్పీచ్‌

పవ‌న్ క‌ల్యాణ్ గొప్ప వ‌క్త ఏం కాదు. అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చేసేలా ఏం మాట్లాడ‌లేడు. నిజానికి ఆయ‌న సినీ ఫంక్ష‌న్ల‌లో క‌నిపించేదే త‌క్కువ‌. ఆయ‌న నోటి నుంచి నాలుగు మాట‌లు వ‌చ్చినా చాలు అనుకుంటారు ఫ్యాన్స్‌. కానీ… ఈమ‌ధ్య రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు క‌దా. స్పీచులు బాగానే ఇవ్వ‌డం ప్రాక్టీస్ చేశారు. రాజ‌కీయ వేదిక‌ల‌పై మాట్లాడ‌డంలో మొద‌ట కాస్త ఇబ్బంది ప‌డినా, ఆ త‌ర‌వాత రాటు దేలుతూ వ‌చ్చారు. ఆ ఎఫెక్ట్ సినీ వేడుక‌ల్లోనూ క‌నిపించాలి. కానీ… అజ్ఙాత వాసి ఆడియో ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ స్పీచ్ చూస్తే… `తీసిక‌ట్టు నాగంబొట్టు` లా ఇదేంటి ఇంత చ‌ప్ప‌గా మారిపోయింది అనిపించింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన వేలాది ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని త‌న ప్ర‌సంగంతో ఉర్రూత‌లూగించ‌ని ప‌వ‌న్‌.. వాళ్ల‌ని బాగా నిరాశ‌ప‌రిచాడ‌నే చెప్పాలి.

ఈ స్పీచ్‌లో ప‌వ‌న్ నుంచి వినిపించిన కొత్త విష‌యం ఏమిటంటే.. `త్రివిక్ర‌మ్‌కి త‌నేం సల‌హాలు ఇవ్వ‌డు.. త‌న నుంచి త్రివిక్ర‌మ్ ఏం తీసుకోడు`. అంతే. గుంటూరు శేషేంద్ర శ‌ర్మ‌ని ప‌వ‌న్‌కి ప‌రిచ‌యం చేసింది త్రివిక్ర‌మే. అంత‌కు మించి కొత్త విష‌యం ఏమీ లేదు. పాత విష‌యాలే మ‌ళ్లీ చ‌ర్విత చ‌ర‌ణంలా మ‌రోసారి గుర్తు చేశాడు ప‌వ‌న్‌. ఆ స్పీచ్‌లో ద‌మ్ము లేదు, స్పీడ్ లేదు. అంత‌కు మించి క్లారిటీ లేదు. ఈ సినిమా ఎలా ఉండ‌బోతోంది అనేది అటు త్రివిక్ర‌మ్ గానీ, ఇటు ప‌వ‌న్ గానీ… ఈ వేడుక‌లో పాల్గొన్న ఒక్క న‌టుడు, సాంకేతిక నిపుణుడు గానీ చెప్ప‌లేక‌పోయారు. అంద‌రి గోల ఒక్క‌టే.. ప‌వ‌న్ నామ స్మ‌ర‌ణ‌. అజ్ఞాత‌వాసి ఆడియోలో అంత‌కు మించి ఒరిగిందేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.