ఓ పెద్ద సినిమా నుంచి అప్ డేట్ వస్తోందంటే అందరి దృష్టీ దానిపైనే ఉంటుంది. చిత్ర బృందం కూడా అభిమానుల్ని ఊరించడానికి ప్రోమోలు, పోస్టర్లూ వదులుతుంటుంది. కానీ ఈ విషయంలో రాజమౌళి కొత్తగా ఆలోచించారు. అసలు ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ‘వారణాసి’లోని పాట విడుదల చేశారు. అసలు వారణాసి నుంచి పాట వస్తుందని గానీ, ఫలానా టైమ్ లో విడుదల చేస్తారని గానీ ఎలాంటి సమాచారం లేదు. సడన్ గా సోషల్ మీడియాలో ఆ పాట ప్రత్యక్షం అయ్యేసరికి ఫ్యాన్స్ షాకయ్యారు. ఓ పెద్ద సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడొచ్చినా, క్షణాల్లో వైరల్ అయిపోతుంది అని చెప్పడానికి అదో ఉదాహరణగా నిలిచింది.
ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ‘వారణాసి’నే ఫాలో అవ్వబోతోంది. ఈనెల 26న రావాల్సిన సినిమా ఇది. కానీ ప్రీ పోన్ అయ్యింది. 19నే ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రెడీ అయినట్టు టాక్. ఏ క్షణంలో అయినా ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది. ముందస్తు ప్రోమోలు, పోస్టర్లూ, సమాచారాలు లేకుండా ఈ ట్రైలర్ ని సోషల్ మీడియాలో వదిలేయాలని చూస్తున్నారు. అంతే కాదు.. ఈ సినిమా నుంచి మరో రెండు పాటలు కూడా బయటకు రావాలి. అవి కూడా సడన్ సర్ప్రైజ్ లా వదలాలని టీమ్ భావిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన కంటెంట్ ఎప్పుడు బయటకు వచ్చినా, సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉంటారు. కాబట్టి.. ఈ పంథా ఫాలో అవుతోంది ఉస్తాద్ టీమ్. భవిష్యత్తులో ఇక నుంచి పెద్ద సినిమాలన్నీ ఈవిధంగానే ఆలోచిస్తాయేమో?


