భారత ప్రజాస్వామ్య చరిత్రలో నరేంద్ర మోదీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యంత సుదీర్ఘ కాలం నాయకత్వం వహించిన నేతగా ఆయన చరిత్ర సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చమ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. ఇందులో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంతో పాటు, భారత ప్రధానిగా కొనసాగుతున్న పదవీ కాలం కూడా కలిసి ఉంది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రస్థానం ప్రారంభించిన మోదీ, దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరంతరాయంగా అధికార పీఠంపై కొనసాగుతున్నారు.
గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన జ్యోతిబసు రికార్డును కూడా మోదీ ఇప్పటికే దాటేశారు. జ్యోతిబసు 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించగా, మోదీ ఇప్పుడు తన 25వ ఏట అడుగుపెట్టారు. అలాగే, ప్రధానిగా మాత్రమే చూస్తే జవహర్లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీలు సుదీర్ఘ కాలం కొనసాగినప్పటికీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి బాధ్యతలను కలిపి లెక్కలోకి తీసుకుంటే మోదీ అందరికంటే అగ్రస్థానంలో నిలిచారు. ప్రధానిగా మాత్రమే చూస్తే నెహ్రూ 16 ఏళ్ల 286 రోజులు ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నారు, కానీ ప్రస్తుత వేగం చూస్తుంటే మోదీ ఆ రికార్డును కూడా సమీపించే దిశగా సాగుతున్నారు.
వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి, నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక ప్రధానిగా మోదీ నిలిచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించి, దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన మొదటి ప్రధానిగా కూడా ఆయన పేరిట ప్రత్యేక రికార్డు ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజల ఆదరణను పొందుతూ పదవిలో కొనసాగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
