దేశంలోని అన్ని సినిమా హాళ్లలోనూ జాతీయ గీతాలాపన తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేయడంతో థియేటర్లలో ‘జనగణమన’ గీతం ప్లే చేస్తున్నారు. ఆ సమయంలో అందరూ లేచి నిలబడాలి. అయితే, కొన్ని చోట్ల చిన్నచిన్న వివాదాలకు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నిర్ణయం తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు భాజపా యువ విభాగం ఓ కన్నేసి ఉంచింది. దీన్ని ఉల్లంఘించినవారిపై కేసులు కూడా పెడుతున్నారు. ఈ నిర్ణయంపై తాజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కొన్ని కీలక అంశాలపై వరుసగా పవన్ కల్యాణ్ ట్వీట్లు చేస్తామని ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి ఆత్మహత్యపై తొలిగా స్పందించారు. రోహిత్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన వైఖరే ఆత్మహత్యకు కారణమని విమర్శించారు. ఆ తరువాత, ఇప్పుడు థియేటర్లలో జాతీయ గీతాలాపన, దేశభక్తికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఒక పార్టీ విధానాలను చూసి దేశభక్తిపై ఆ పార్టీకి ఉన్న భక్తిని అంచనా వేయడం సరికాదని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయినా, సినిమా థియేటర్లను దేశభక్తి ప్రదర్శనకు ఎగ్జామ్స్ హాల్స్గా మార్చకూడదని పవన్ అన్నారు. అధికార పార్టీ విధానాలకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశాన్ని వ్యతిరేకించినట్టు ఎలా అవుతుందని నిలదీశారు. నిజమైన దేశభక్తి అంటే విలువలతో కూడిన మావన సంబంధాలే అని పవన్ అభివర్ణించారు. రాజకీయ పార్టీలవారు నిర్వహించే సభల్లో సమావేశాల్లో జాతీయ గీతాన్ని ఎందుకు ఆలపించడం లేదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనపై తన అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ ఈ విధంగా వ్యక్తం చేశారు. మరి, దీనిపై భాజపా నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి, రోజురోజుకీ భాజపాకి దూరంగా జరుగుతున్నట్టున్నారు పవన్ కల్యాణ్! పవన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో రాజకీయ పార్టీల సమావేశాల్లో జాతీయ గీతం ఎందుకు ఆలపించడం లేదన్న ప్రశ్న బాగుంది. థియేటర్లలో జాతీయ గీతాలపన తప్పనిసరి అయినప్పుడు, సభలూ సమావేశాల్లో కూడా తప్పనసరిగా ఆలపించాలి కదా!