స్థానిక సంస్థలూ, ఎంఎల్ఎలు ఎన్నుకునే ఎంఎల్సిల స్థానాలపై చర్చ కేంద్రీకృతమైంది గాని వాస్తవానికి ఉపాధ్యాయులు పట్టభద్రుల స్థానాలపై రాష్ట్రస్థాయిలో వుండాల్సిన కేంద్రీకరణ వుండటం లేదు. జిల్లాల్లో మాత్రం మోత మోగిపోతున్నది. టిడిపి బిజెపి అభ్యర్థులకు మద్దతునిస్తున్నా ప్రధానంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పిడిఎప్)కే తరపున నిలబడిన పాత వారికే బాగా మద్దతు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ఎంవిఎస్ శర్మ, నెల్లూరుచిత్తూరు నుంచి వి.బాలసుబ్రహ్మణ్యం,యెండల శ్రీనివాసారెడ్డి, రాయలసీమ నుంచి డా.గేయానంద్ ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎంవిఎస్ శర్మ తప్ప మిగిలిన వారంతా పోటీలో వుండగా ఆయన బదులు అజైశర్మ రంగంలో వున్నారు. యుటిఎప్సిఐటియు జనవిజ్ఞానవేదిక ఇతర సంఘాలు వారికి బాగా మద్దతునిస్తున్నాయి. ధనబలం రాజకీయ ప్రాబల్యం రకరకాల కానుకలతో వ్యూహాలతో ముంచెత్తుతున్నా దీర్ఘకాలిక కోణంలో సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకోవాలన్న భావన ఓటర్లలో వ్యక్తమవుతుందని అంటున్నారు. పిడిఎఫ్ అభ్యర్థులందరూ స్వతహాగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఒకరు వైద్యులు కావడంతో ప్రజలకు దగ్గరగా వున్నారు. వారి గత పదవీ కాలంలో ఎలాటి ఆరోపణలూ ఎదుర్కొలేదు.కాబట్టి వారి పట్ట సుహృద్భావమే వుంది. వీళ్లను ఎదుర్కొవడం కష్టం గనకే తెలుగుదేశం ముఖ్లులెవరూ పోటీకి సిద్ధపడలేదు. ముచ్చట పడిన వారిని కూడా బెదరగోట్టారట. దీనికి తోడు టిడిపి బిజెపి మినహా మిగిలిన పార్టీల మద్దతు కోరాలని పిడిఎఫ్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఎంవిఎస్ శర్మ జగన్తో సహా వివిధ పార్టీల నేతలను ప్రత్యక్షంగా పరోక్షంగా కలుసుకున్నారు. జగన్ మద్దతునిస్తానని వాగ్దానం చేశారట. సిపిఐ లోక్సత్తా వంటివి కూడా బలపర్చే అవకాశముంది.. ఇప్పుడంటే పునరావాస కేంద్రంగా మారింది గాని గతంలో అక్కడ ఉపాధ్యాయ కార్మిక నాయకులే అధికంగా వుండేవారు. ఆ విధంగా శాసనసభ కన్నా మండలి మాటకే ఎక్కువ విలువనిచ్చిన కాలం కూడా వుంది. రోశయ్య కూడా వుండేవారు. అసలు ఆయన కోసమే ఎన్టీఆర్ దాన్ని రద్దు చేయించారనే ఆరోపణ వుంది గాని నిజం కాదు.మొత్తానికి పిడిఎఫ్ ఎంఎల్సిలు మరోసారి ఎన్నికైతే మండలిలోనూ సమస్యలపై పోరాడ్డం సుభమవుతుంది. విశుద్ధ రాజకీయాలకు మార్గం సుగమం అవుతుంది. రెండవ ప్రాధాన్యతా వోటు పద్ధతి కూడా వుంటుంది గనక ఆ విధంగానూ పిదిఎఫ్ అభ్యర్థులకు వేసే వారుంటారు. మొత్తంపైన వారంతా వస్తే శాసనమండలి నిజమైన సమస్యలపై వాస్తవిక చర్చలకు వేదిక అవుతుంది.