నాగార్జున సినిమాలో బ్రహ్మానందం ఓ పబ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూంటాడు. రకరకాలుగా ప్రయత్నిస్తూంటాడు. కానీ డోర్ దగ్గర ఆపేస్తూంటారు. చివరికి నాగార్జున తో కలిసి వెళ్తాడు. లోపలికి వెళ్లిపోయాననుకుంటాడు.. కానీ సెక్యూరిటీ.. నెల్లూరు పెద్దారెడ్డి స్టైల్లో తీసుకు వచ్చేస్తారు. ఇది సోషల్మీడియాలో వైరల్ అయ్యే మీమ్ . ఈ పరిస్థితి ఇప్పుడు నిజమైన పెద్దారెడ్డికి వచ్చింది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి .. నియోజకవర్గంలో అడుగు పెట్టడం పెద్ద సమస్యగా మారింది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన రెచ్చిపోయారు. జేసీ ఇంట్లోకి వెళ్లి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. జేసీ వర్గీయులపై దాడులు జరగని సందర్భమే లేదు. ఇప్పుడు అధికారం పోయే సరికి ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఎన్నికలు అయిపోయి ఏడాది అయినా ఇప్పటి వరకూ ఆయన నియోజకవర్గానికి రాలేకపోయారు. కోర్టుకెళ్లినా.. ప్రయోజనం లేకపోయింది.
తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. ఇప్పటికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇక పోలీసులకు చెప్పకుండా తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం ఉదయమే ఆయన తాడిపత్రిలో కనిపించారు. పోలీసులు వెంటనే వచ్చి.. ఉండటానికి కుదరదని చెప్పి అనంతపురం తరలించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారు. ఆ ఇంటికి శనివారమే కొలతలు వేశారు. కూల్చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన ఉదయమే వచ్చారు.