తాడిపత్రికి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. సోమవారం ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఆ సమయంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో శివుని విగ్రహం పెట్టి .. అభిషేకం చేసే కార్యక్రమంలో ఉండటం, పెద్ద ఎత్తున ఆయన అనుచరులు అక్కడ గుమికూడి ఉండటంతో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేదు. మార్గమధ్యంలోనే ఆపేశారు
పోలీసులపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వెళ్తానని పట్టుబట్టారు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని … తాను తాడిపత్రికి ఎప్పుడు రావాలో జేసీ ప్రభాకర్ రెడ్డినే అడుగుతానని ఫైరయ్యారు. మరో వైపు కోర్టు ఆదేశాలు ఉంటే పెద్దారెడ్డి తాడిపత్రికి రావొచ్చని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. గతంలో కోర్టులు ఆదేశించినా టీడీపీ నేతల్ని తాడిపత్రిలోకి రానివ్వలేదన్నారు. పెద్దారెడ్డిపై తనకు ఏ మాత్రం కక్ష లేదని.. ఆయన గతంలో చేసిన దౌర్జన్యాలకు.. తాడిపత్రి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా పెద్దారెడ్డి రాజకీయాలు చేయడం, ఓ సారి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి కూర్చుని .. రెచ్చగొట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆయన ఓడిపోయాడు. వైసీపీ ప్రభుత్వం పోయింది. దాంతో కనీసం తాడిపత్రిలోకి కూడా అడుగుపెట్టలేకపోతున్నారు. ఓ సారి ఎవరికీ చెప్పకుండా ఉదయమే తాడిపత్రిలోకి వచ్చేశారు. కానీ పోలీసులు అరగంటలోనే మళ్లీ బయటకు పంపేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాడిపత్రి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇంటిని కూల్చివేయించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఆయనే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు.