రివ్యూ: పెదకాపు-1

తెలుగు360 రేటింగ్ : 2.25/5

శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే కుటుంబం అంతా కలిసి.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చనే నమ్మకం. అయితే `నార‌ప్ప‌`తో ఆయన దారి మారింది. అసురన్ రీమేక్ గా వ‌చ్చిన సినిమా అది. రీమేక్ అయినా.. త‌న జోన‌ర్‌ని వ‌దిలి రావ‌డానికి శ్రీ‌కాంత్ అడ్డాల చేసిన ప్ర‌య‌త్నం కాబ‌ట్టి.. సరికొత్త మార్పే గానే చెప్పుకోవాలి. ”మనిషి మంచోడు.. అసలు మనిషంటేనే మంచోడు”అనే ఆలోచన ధోరణి వున్న శ్రీకాంత్ అడ్డాల.. ఒక్కసారిగా రూటు మార్చి ‘ఏ’ సర్టిఫికేట్ తో పెదకాపు 1 సినిమా చేశారు. విరాట్ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేపాయి. అటు సినిమా యూనిట్ కూడా పెదకాపు తో తెలుగులో శ్రీకాంత్ అడ్డాల రూపంలో ఓ వెట్రిమారన్ వస్తారని చెప్పింది. మరి ఇంతకీ పెద్దకాపులో ఏముంది? రెండు భాగాలుగా తీయాల్సినంత కథ ఇందులో ఏముంది? ఈ సామాన్యుడి సంతకం ప్రేక్షకులని అలరించిందా?

అది 1962. గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో చెలరేగిన అల్లర్ల వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తమౌతాయి. కొందరు ప్రాణాలు చేతబట్టుకొని గ్రామాల్ని వదిలి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఓ పొలంలో కనిపిస్తుంది. ఆ బిడ్డని చూసిన ఓ అనామకురాలు ఊర్లో ఎవరికైనా అమ్మేసి ర‌మ్మ‌ని తన కూతురితో చెబుతుంది. అలా అ బిడ్డని వూర్లోకి తీసుకెళ్ళిన‌ పాప.. ఆ వూర్లో మాస్టర్ (తనికెళ్ళ భరణి) కి ఇస్తుంది. కట్ చేస్తే.. 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్) బయన్న ( నరేన్) రెండు ద్రువాలు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులని చేస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. అసలు తను ఏమయ్యాడు? మాస్టర్ పెంచుకున్న పాప ఎవరు? పెదకాపు.. సత్యరంగయ్య, బయన్న లాంటి బలవంతులని ఎలా ఎదిరించాడు? అసలు లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల) అక్కమ్మ ( అనసూయ) పార్టీ ఇంచార్జ్ ( నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి? పెదకాపు సామాన్యుడి సంతకంగా ఎలా ఎదిగాడనేది తక్కిన కథ.

కథ చెప్పడంలో శ్రీకాంత్ అడ్డాలకి ఒక ప్రత్యేకమైన శైలి వుంది. తను చెప్పదలచుకున్న కథ ఏమిటో ముందే ఒక సీన్ రూపంలో గానీ వాయిస్ రూపంలో గానీ వివ‌రిస్తాడు. పెదకాపులో కూడా ఆ స్టయిల్ ని ఫాలోయ్యారు. ‘సామాన్యుడిగా మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలని అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారి మూసేసి తోక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు’ అంటూ సినిమా ప్రారంభానికి ముందే ఈ నోట్ ఇచ్చిన తను చెప్పదలచుకున్న కథ ఏమిటో ముందే ఒక క్లారిటీ ఇచ్చారు. ఓ సామాన్యుడి సంతకం అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

ఈ నోట్స్ వరకూ క్లారిటీగానే వున్నారు. అయితే ఒక సామాన్యుడు బలవంతుడిని ఎదుర్కొని గెలిచే క్రమాన్ని చూపించడంలో ఓ దారి కాకుండా అనేక దారుల వెంట ప్రయాణం చేశారు శ్రీకాంత్ అడ్డాల. ప్రతిదారిలో కొంత ప్రయాణించి గమ్యాన్ని చేరే మార్గం ఇది కాదని తెలుసుకొని మళ్ళీ కొత్తదారి వెతుక్కుంటూ సాగిన ఈ పెదకాపు ప్రయాణం చాలా చోట్ల అగమ్యగోచరంగా తోస్తుంది.
ఒక కథని చెప్పడానికి వంద ఎమోషన్స్ పట్టుకోవలసిన అవసరం లేదు. ఒక్క ఎమోషన్ ని బలంగా పట్టుకుంటే చాలు. చాలా సార్లు ఇది నిరూపితమైయింది. ఎక్కువ ఎమోషన్స్ వుంటే ప్రేక్షకుడికి కూడా లేనిపోని చికాకు కలుగుతుంది. పెదకాపు కూడా చాలా చోట్ల అలాంటి ఫీలింగ్‌ తెప్పిస్తుంది. తల్లితండ్రులు ఎవరో తెలియని ఒక పసిపాప తో ఈ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. ఆమె కథ ఏమిటో తెలుసుకోవాల‌నే కుతూహలం నిజంగా ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ కథని అక్కడ వదిలేసి పెదకాపు కథని ఎత్తుకున్నాడు. పోనీ… అతని జర్నీ అయినా చూద్దామని అనుకునే లోపల.. సడన్ గా కథని బ్రదర్ సెంటిమెంట్ వైపు తిప్పేస్తారు. పోనీ అదే ఇందులో కీలకం అనుకోని దానికి కనెక్ట్ అయ్యేలోగా.. రాజకీయ పార్టీని దించారు. అక్కడితో ఆడకుండా అక్కమ్మ పాత్రని పరిచయం చేసి, గౌరి పాత్రని చంపేసి.. అసలు ఈ కథ ఎటువెళుతుంది? ఇందులో ఎవరి ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలి? అనే అయోమయంలో ప్రేక్షకులని పడేశారు.

నిజానికి చాలా రొటీన్ కథ ఇది. కథలో నావల్ గా ఫీలయ్యే ఎలిమెంట్ అంటూ ఏది వుండదు. కానీ శ్రీకాంత్ అడ్డాల ఇందులో పాత్రల్ని సగం సగమే ఓపెన్ చేస్తూ అసలు ఈ పాత్రల సంగతి ఏమిటో చుద్దామనే ఆసక్తిని కలిగించడంలో మాత్రం ఆకట్టుకునేలానే రాసుకున్నారు. ఐతే ఈ ఆసక్తి అందరిలో వుండదు. కొన్ని పాత్రలు క్లూలెస్ గా ప్రవర్తిస్తున్న తీరు అయోమయానికి దారి తీసి అసహనం కలిగించే ప్రమాదం ఏర్పడింది.

పెదకాపులో వున్న మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే.. ప్రేక్షకులని కథలోకి తీసుకెళ్లడంలో సహజత్వం కొరవడింది. పెదకాపు పాత్రతో ఈ కథని అనుసరించాలని అనుకుంటే.. అసలు ఆ పాత్రకు సరైన ఆర్క్ రాసుకోలేదనిపిస్తుంది. తొలి సన్నివేశంలోనే ఓ పెద్ద చెట్టుని నరికి గ్రామంలో జెండా పాతేస్తాడు పెదకాపు. అడ్డు వొచ్చినోడ్ని పాతేస్తానని బెదిరిస్తాడు. ఆ సన్నివేశం చూస్తున్నపుడు అతడు సామాన్యుడనే భావన ప్రేక్షకుల్లో వుండదు. పైగా ఆ పాత్ర ఒకొక్క సన్నివేశంలో ఒకొక్కలా ప్రవర్తిస్తుంటుంది. ఇక ఇందులో ప్రేమకథ కూడా ఉందా లేదాన్నట్లుగానే వుంటుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా తేడాగా వుంటుంది. ఏదో అనుకోని ఇంకేదో రాసి, ఇంకేదో తీసినట్లుగా వుంది.

పెదకాపులో విచిత్రంగా అనిపించిన అంశాలు కూడా కొన్ని వున్నాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇది గోదావ‌రి జిల్లాల క‌థేనా? అనిపిస్తుంది. ఆ జిల్లాలో పెట్టిపెరిగిన వాళ్ళు చూస్తే ‘ఏంటి మా వూర్లో ఇంత రక్తపాతం జరిగిందా? ఇళ్ళల్లోకి దూరి నరికేసుకునేవారా? అడ్డంగా తలలు నరికేసినా కేసులు ఉండేవికాదా? అనే ఆశ్చర్యానికి గురౌతారు. గోదావ‌రి జిల్లాల్లో పుట్టిన ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌కి మాత్రం అవేం ఆశ్చ‌ర్యం అనిపించ‌లేక‌పోవ‌డం ఇంకో ఆశ్చ‌ర్యం.

అయితే పెదకాపులో ఎమోషన్స్ ని పీక్స్ తీసుకెళ్ళిన కొన్ని సన్నివేశాలు వున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్ లో వ‌చ్చే ఆ మలుపు ఎవరూ ఊహించనిదే. అప్పటివరకూ ఏకైక ఆసక్తిగా వున్న రావు రమేష్ పాత్రని అలా తీర్చిదిడ్డం నిజంగా రిస్క్. అయితే ఇంటర్వల్ తర్వాత కూడా ఆ పాత్ర ఉంటుందని అనుకున్నారు కానీ.. ఇక ఆ పాత్ర లేదని ముందే రిజిస్టర్ అయిపోవడంతో పోస్ట్ ఇంటర్వెల్ ఫ్లాష్ బ్యాక్ అంతా తేలిపోయింది. ఒక పాత్ర క్రూరమైనదని చెప్పాలంటే.. ఆ పాత్ర ఉండగానే చెప్పాలి. అంత క్రూరమైన వ్యక్తిని ఎలా ఎదుర్కుంటారనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగాలంటే ఆ పాత్రని ఉంచాలి. ముందే ముగించేసి ఆ పాత్ర ఇంత దారుణమైనదని చెబితే పోయిన పాత్రపై ప్రేక్షకుడిలో ఎలాంటి ఫీలింగ్ వుండదు. పెదకాపులో కూడా ఇదే జరిగింది. బహుశా కన్నబాబు పాత్రతో మిగతా సగం అంతే ఇంటెన్స్ గా నడపాలని అనుకున్నారేమో కానీ కనీసం నిలబడలేని కన్నబాబు పాత్రపై ఒకరకమైన జాలితప్పితే ద్వేషం పగ ప్రతీకారం లాంటి ఫీలింగ్స్ కలగవు.

పెదకాపు టైటిల్ రోల్ చేసిన విరాట్ కర్ణ కొత్త కుర్రాడు. ఐతే తనకి నటనలో ఈజ్ వుంది. యాక్షన్ సీన్స్ బాగానే చేశాడు. కెమరాముందు సహజంగా కదిలాడు. కానీ ఎమోషన్స్,. భారీ డైలాగులు చెప్పినపుడు కొత్తవాడనే సంగతి అర్ధమైపోతుంది. డబ్బింగ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హీరోయిన్ గా చేసిన ప్రగతి పాత్రని అంత బలంగా రాసుకోలేదు. ఆ పాత్రలో చాలా చోట్ల స్పష్టత కొరవడింది. గౌరీ పాత్రలో చేసిన బ్రిగడ పరిస్థితి కూడా అంతే. ఆ పాత్రని ముగించిన తీరు సహజంగా లేదు. అక్కమ్మగా చేసిన అనసూయ చాలా కీలకమైన పాత్ర. ఆమె నటన బావుంది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. శ్రీకాంత్ అడ్డాల కి రావు రమేష్ అంటే ఎంత ఇష్టమో ఈ సినిమాతో మరోసారి రుజువైయింది. సత్యరంగయ్య పాత్రని బాడీ లాంజ్వేజ్ ని మేనరిజంని ఎలా రాసుకున్నారో కానీ ఆయన రాసినదాని కంటే బాగా చేశారనిపించింది. ఒక చిన్న సైగతో హత్య చేయించి… ‘ముక్కుపట్టేసింది వేడి వేడి సేప పులుసు తింటేగాని తగ్గేలా లేదు’అంటూ కారెక్కి వెళ్ళిపోయే సన్నివేశం చేసిన తీరు ఆయనికే చెల్లుతుంది. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. బహుశా దర్శకుడు రాసుకున్న ఆ పాత్రకు తాను తప్పితే ఎవరూ న్యాయం చేయలేరని ఆ పాత్ర చేశారనిపించింది. కుర్చీ నుంచి కదలకుండా కోపం తెప్పించడం అంత సులువు కాదు. ఈ పాత్రని ఆయన చేసిన తీరు బావుంది. తనికెళ్ళ భరణి పాత్ర పరిమితంగానే వుంటుంది. పార్టీ ఇన్ఛార్జ్ గా నాగబాబు పాత్ర కూడా కథలో పలుమార్లు కీలకంగా వస్తుంది. బుల్లబ్బాయి పాత్రలో శ్రీనివాస్ వడ్లమాని చేసిన పాత్ర.. పాత సినిమాల్లో ఫిట్టింగ్ మాస్టర్ అల్లూరామలింగయ్యని గుర్తుకు తెస్తుంది. ఈశ్వరిరావు గుండెధైర్యం వున్న అమ్మగా చేసింది. రాజీవ్ కనకాలలతో సహా మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

టెక్నికల్ గా పెదకాపుకి ఫుల్ మార్కులు పడిపోతాయి. ఛోటా కె నాయుడు కెమరాపనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు కమర్షియల్ సినిమాకి కలర్ ఫుల్ రంగులు అద్దిన చోటా .. పెదకాపుతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తమిళ్ లో కొన్ని సినిమాలు చూస్తున్నపుడు ఇలాంటి కెమరాపనితనం మనం ఎందుకు చేయలేకపోతున్నామనే మాట వినిపిస్తుంది. పెదకాపు చూసిన తర్వాత ఇంక ఆ లోటు తెలుగులో లేదనిపిస్తుంది. అంత అద్భుతంగా విజువల్స్ ని బంధించారు చోటా. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. పాటలు సినిమాకి కలిసిరాలేదు. అలాగే మాటలు కూడా. పాటలు మాటలతో కథ చెప్పడం శ్రీకాంత్ అడ్డాల ప్రత్యేకత. పెదకాపులో అది కనిపించలేదు. నేపధ్య సంగీతం మాత్రం బావుంది. పెదకాపు కి పార్ట్ 2 కూడా వుంది. ఐతే దాని కోసం ఎదురుచూడాలనే ఆసక్తిని కలిగించలేకపోయింది తొలి భాగం.

తెలుగు360 రేటింగ్ : 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close