రివ్యూ: పాత‌దే అన్నా.. ఈ ‘పెద్ద‌న్న‌’

Peddhanna Review, Annatthe Review

రేటింగ్: 1.75/5

త‌మిళ ద‌ర్శ‌కులు ఎంత కొత్త‌గా ఆలోచిస్తారో..
అంత రొటీన్‌గానూ క‌థ‌లు అల్లేసుకుంటారు. `జై భీమ్‌` చూసి మెచ్చుకునే లోపే…. `పెద్ద‌న్న‌` అనే ప‌ర‌మ రొటీన్ సినిమా తీసి వ‌ద‌ల‌గ‌ల‌రు. ర‌జ‌నీకాంత్ అన‌గానే కొన్ని కొల‌త‌లున్నాయి. ఎప్పుడో కుట్టేసిన మాస్ కోటులో.. ఆయ‌న్ని చూసుకుంటే అదే ప‌ది వేలు అనుకునే ద‌ర్శ‌కులున్నారు. నిర్మాత‌లున్నారు. ర‌జ‌నీ ఉంటే చాలు… క‌థేం అక్క‌ర్లెద్దు అనే ధైర్యం కొన్నాళ్లు సాగింది కూడా. కానీ… అస్త‌మానూ ఆ అప్పులు ఉడ‌క‌వు. ఎంత ర‌జ‌నీ సినిమా అయినా, అందులో ఏదో ఓ ఎలిమెంట్ కొత్త‌గా అనిపించాల్సిందే. మ‌రి.. `పెద్ద‌న్న‌`లో ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏం లేవు?

రాజోలు ప్రెసిడెంట్ పెద్ద‌న్న (ర‌జ‌నీకాంత్‌). త‌న‌కు చెల్లెలు క‌న‌క‌మ‌హాల‌క్ష్మి (కీర్తి సురేష్) అంటే పంచ ప్రాణాలు. త‌న‌ని విడిచి ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేడు. చెల్లెల్ని పెళ్లి చేసి పంపించాలి క‌దా? అందుకోసం సంబంధాలు వెదుకుతుంటాడు. `నువ్వు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా` అని క‌న‌కం కూడా మాటిస్తుంది. దాంతో ఓ సంబంధం ఫిక్స్ చేస్తాడు. అరంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేద్దామ‌నుకుంటాడు. కాసేప‌ట్లో పెళ్లి అన‌గా… క‌న‌కం క‌నిపించ‌కుండా పోతుంది. తీరాచూస్తే… క‌న‌కం ఒక‌ర్ని ఇష్ట‌ప‌డుతుంది. త‌న కోస‌మే ఇల్లు వ‌దిలిపోతుంది. దాంతో పెద్ద‌న్న‌కృంగిపోతాడు. ఆరు నెల‌ల పాటు.. మ‌నిషి కాడు. అయితే ఆ త‌ర‌వాత‌.. క‌న‌కం కొల‌కొత్తాలో ఉంద‌ని తెలుస్తుంది. అక్క‌డ కెళ్లి చూస్తే.. పీక‌ల్లోతు క‌ష్టాలోఉంటుంది. ఆ క‌ష్టాలు ఎవ‌రి వ‌ల్ల వచ్చాయి? కొల‌కొత్తాలో క‌న‌కాన్ని ఇబ్బంది పెట్టింది ఎవ‌రు? చెల్లెల్ని ప్రాణంగా చూసుకునే పెద్ద‌న్న‌… వాళ్ల‌పై ఎలా రివైంజ్ తీర్చుకున్నాడు? అనేదే ఈ సినిమా.

ర‌జ‌నీకాంత్ పిలిచి `మ‌నం సినిమా చేద్దాం. టైమ్ లేదు` అన‌గానే.. శివ కొత్త‌గా క‌థ రాసుకోవ‌డం మానేసి, పాత స్క్రిప్టునే కాస్త దుమ్ము దులిపి – ర‌జ‌నీకాంత్ కోసం మ‌ళ్లీ తీసిన‌ట్టు అనిపిస్తుంది. పెద్ద‌న్న లో క‌థేం లేదు. ఉన్నా అది కొత్త‌ది కాదు. `వేదాళం`లో ఇలాంటి క‌థే చూశాం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌వ‌రం కూడా దాదాపు ఇదే క‌థ‌. దాన్నే… ఇప్పుడు ర‌జ‌నీ స్టైల్ లో తీశాడు శివ‌.

ఓపెన్ చేస్తే.. క‌ల‌క‌త్తా న‌గ‌రం అట్టుడికి పోతుంటుంది. పెద్ద‌న్న కోసం గ్యాంగుల‌న్నీ వెదుకుతుంటాయి. టీవీ ఛాన‌ళ్ల‌న్నీ ఎవ‌రీ పెద్ద‌న్న అంటూ.. నోరేసుకుని ప‌డిపోతుంటాయి. పేప‌ర్లో పెద్ద పెద్ద హెడ్డింగులు చూపిస్తుంటారు. ఇలాంటి భారీ బిల్డ‌ప్పుల మ‌ధ్య పెద్ద‌న్నని రివీల్ చేశాడు ద‌ర్శ‌కుడు. ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ కి ఇలాంటి మూమెంట్స్ చాలు అనుకున్నాడు శివ‌. అయితే… ఆల్రెడీ ర‌జ‌నీఫ్యాన్స్ ఇలాంటి రొటీన్ రొడ్డ‌కొట్టుడు సీన్లు చూసి చూసీ విసిగెత్తిపోయారు. అయితే శివ మాత్రం మ‌ళ్లీ అలాంటి సీన్లు రాసుకున్నాడు. పోలీస్ స్టేష‌న్ లో ప్ర‌కాష్ రాజ్ గ్యాంగ్ ని కొట్టే సీన్లు కూడా లాజిక్ కి అంద‌వు. కేవ‌లం.. ర‌జ‌నీ మ్యాజిక్ కోసం… ఫైటు మ‌ధ్య‌లో, చివ‌ర్లో చెప్పే కొన్ని జీవిత సూక్తులు (ర‌జ‌నీ సినిమాల్లో వాటిని పంచ్ డైలాగులు అని అంటారు.. ) విన‌డం కోసం చూడాలి.

మ‌ధ్య‌లో ర‌జ‌నీ చేసే ముదురు రొమాన్స్ ఒక‌టి. అటు మీనా, ఇటు ఖుష్బూని రంగంలోకి దింపి… వింటేజ్ ర‌జ‌నీని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఆ సీన్లు కాస్త టైమ్ పాస్ క‌లిగిస్తాయి. అన్నంటే ప్రాణం పెట్టే చెల్లాయి, నీకిష్ట‌మైన వాడ్ని ఇచ్చి పెళ్లి చేస్తా అనే అన్న‌… ఇద్ద‌రూ ఉన్నా కూడా.. చెల్లాయి, న‌చ్చిన‌వాడ్ని పెళ్లి చేసుకోవ‌డానికి ఊరి వ‌దిలి పారిపోవ‌డం ఏమాత్రం లాజిక్ అనిపించుకోదు. పెళ్లి ముహూర్త స‌మ‌యంలోనూ… `అన్న‌య్యా.. నాకు ఈ పెళ్లి వ‌ద్దు` అని చెల్లెలు చెబితే.. అన్న ఒప్పుకుంటాడు కూడా. అంత బ‌ల‌మైన బాండింగ్ వాళ్ల మ‌ధ్య ఉన్న‌ప్పుడు కూడా.. చెల్లెలు వెళ్లిపోవ‌డం కావాల‌ని రాసుకున్న కాఫ్లిక్ట్. అంతేకాదు… చెల్లెల‌కు క‌నిపించ‌కుండా దుష్ట సంహారం చేయ‌డం అనే పాయింట్ లోనూ.. లాజిక్ లేదు. ర‌జ‌నీకి ఏ క్ష‌ణంలో కూడా అడ్డు లేకుండా పోతుంటుంది. సెకండాఫ్ అంతా యాక్ష‌నే. క‌నిపించిన‌వాడ్ని కొట్టుకుంటూ పోవ‌డం త‌ప్ప ర‌జ‌నీ చేసిందేం లేదు. ఈ సినిమాలో శివ న‌మ్మింది. అన్నా – చెల్లెళ్ల సెంటిమెంట్. దాన్ని వీలైనంత రొటీన్ ప‌ద్ధ‌తిలో.. పాత వాస‌న‌కొట్టొచ్చేలా తెర‌కెక్కించాడు. చెల్లెలు బాధ ప‌డ‌డం, అన్న దూరంగా ఉండి కుమిలిపోవ‌డం – ఈ సీన్లు చూసీ, చూసీ ప్రేక్ష‌కుల‌కు విసుగొచ్చేస్తుంటుంది. విల‌న్ల‌ను ముందు బ‌ల‌వంతులుగా చూపించినా, పెద్ద‌న్న పేరు ఎత్తేస‌రికి వ‌ణికిపోతుంటారు. అంత క్రూరంగా చూపించిన జ‌గ‌ప‌తి బాబుని సైతం…ర‌జ‌నీ రెండు దెబ్బ‌ల‌కుమ‌టాష్ అనిపిస్తాడు. ర‌జ‌నీకదా..? ఎవ‌రైనా ఎక్కువ టైమ్ తీసుకోకూడ‌దేమో..?

ర‌జ‌నీ వ‌య‌సు 70. ఈ వ‌య‌సులో కూడా అంత హుషారు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఈ మ‌నిషికి. ఇది వ‌ర‌క‌టి సినిమాల కంటే.. త‌న వ‌య‌సు ఈ సినిమాలో త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. త‌న స్టైల్‌, మేనరిజం వంద‌ల సినిమాల్లో చూశాం. అయినా ఆ క్రేజ్ త‌గ్గ‌లేదు. న‌య‌న‌తార గెస్ట్ అప్పీరియ‌న్స్ టైపు. త‌ను మాత్ర‌మే చేయ‌ద‌గిన పాత్ర కాదిది. కీర్తి సురేష్ చేయ‌డం వ‌ల్ల‌.. చెల్లాయి పాత్ర‌కు మ‌రింత మైలేజీ వ‌చ్చింది. త‌న వంతుగా ఆ పాత్ర‌కు న్యాయం చేసింది. జ‌గ‌ప‌తిబాబు ఇంట్రో సీన్‌, త‌న గెట‌ప్‌.. పక్కా త‌మిళ స్టైల్‌. తెలుగువాళ్లు ఈ అవ‌తారంలో జ‌గ్గూ భాయ్‌నిచూడ‌లేరేమో..?

ఇమాన్ నేప‌థ్య సంగీతం హోరెత్తిపోయింది. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆ డీటీఎస్ సౌండ్ ఎఫెక్టులు చెవిలో మార్మోగుతుంటాయి. పాట‌ల్లో ప‌దాలు ఇత్త‌డైపోయాయి. సీన్‌లో మూమెంట్ ఏం లేక‌పోయినా.. ఆర్‌.ఆర్‌తో అద‌ర‌గొట్టేస్తుంటాడు ఇమాన్‌. శివ క‌థ‌ని న‌మ్మ‌లేదు. కేవ‌లం మాస్ ఎలిమెంట్లు, ర‌జ‌నీ స్టైల్ ని న‌మ్ముకుని ఈ సినిమా చేశాడు. నిర్మాత‌లు మాత్రం భారీగానే ఖ‌ర్చు పెట్టారు.

ట్రైల‌ర్లు చూస్తుంటే.. వింటేజ్ ర‌జ‌నీని చూస్తామ‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. కానీ శివ మాత్రం.. ర‌జ‌నీ పాత సినిమాల‌న్నీ క‌లిపి కుట్టాడు. దానికి ఎన‌భైల‌నాటి సెంటిమెంట్ జోడించాడు. అంత‌కు మించి పెద్ద‌న్న‌లో ఏం లేదు.

ఫినిషింగ్ ట‌చ్‌: తుస్సుమ‌న్న దీపావ‌ళి ప‌టాసు

రేటింగ్: 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పరామర్శలతో బాధితులకు భరోసా వస్తుందా !?

సొంత జిల్లా ప్రజలు అతలాకుతలమైపోయినా సీఎం జగన్ పట్టించుకోలేని తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత రెండు రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి, కడపతో పాటు నెల్లూరు జిల్లాలోనూ పర్యటించారు....

ఆ గోరు ముద్దలు జగనన్నవి కావట !

జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్‌వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం...

టికెట్ రేట్లు తగ్గించే ఆలోచన లేదు : మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్‌ ధరలు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులతో...

ఏపీ ఉద్యోగ సంఘ నేతలను వ్యూహాత్మకంగా అవమానిస్తున్నారా !?

ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కావాలనే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘ నేతల్ని తీవ్రంగా అవమానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పీఆర్సీ కోసం అదే పనిగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలతో...

HOT NEWS

[X] Close
[X] Close