ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమైంది ‘పెద్ది’. ఆ డేట్ అందుకోవడానికి చిత్రబృందం శతవిధాలా ప్రయత్నిస్తోంది. షూటింగ్ ఇంకా బాకీ. ఏప్రిల్ 15 వరకూ షూట్ జరగబోతోందని సమాచారం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా తక్కువ సమయం ఉన్నట్టు. రెహమాన్ ఆర్.ఆర్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మరి అనుకొన్న సమయానికి సినిమా రెడీ అవుతుందా, లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఓ ఐటెమ్ పాట షూట్ చేయాల్సివుంది. రెహమాన్ ఇప్పటికే ట్యూన్ ఇచ్చేశారు. పాట కోసం ఓ కథానాయిక కావాలి. నలుగురైదుగురు ఐటెమ్ గాళ్స్ తో ఈ పాట రూపొందిస్తారని ప్రచారం జరిగింది. ఆ ఆలోచనతో నిర్మాతలు కూడా కొంతమంది కథానాయికల పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు ఓ ఐటెమ్ గాళ్ తోనే సరిపెట్టుకోవాలని నిర్మాతలు ఫిక్సయినట్టు సమాచారం.
‘పెద్ది’ ఐటెమ్ గాళ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మృణాళ్ ఠాకూర్ పేరే వినిపించేది. ఇప్పుడు తననే ఖాయం చేసినట్టు టాక్. అయితే ఈ పాటలో జాన్వీ కపూర్ కూడా జాయిన్ అవుతుందట. అంటే చరణ్, జాన్వీ, మృణాళ్ని ఈ పాటలో చూడొచ్చన్నమాట. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పాటని షూట్ చేస్తారు. మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేయనున్నారు. ఈసారి యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ని సిద్ధం చేస్తున్నారు. రెహమాన్ పాటలు చాట్ బస్టర్లుగా మారిపోయాయి. మరో మూడు పాటలు రానున్నాయి. ఐటెమ్ గీతం మాత్రం మార్మోగిపోతుందని తెలుస్తోంది. ఈపాటని కూడా అనంత శ్రీరామ్ నే రాశారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించారు.

