నిన్నా మొన్నటి వరకూ గప్ చుప్ గా ఉన్న ‘ఫౌజీ’ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ‘స్పిరిట్’ కంటే ముందు ఈ సినిమానే విడుదల చేస్తారని, ప్రభాస్ బల్క్ కాల్షీట్లు ఇస్తున్నారని, ఈ దసరాకి ఈ చిత్రాన్ని తీసుకొస్తారన్నది వార్త. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నిజానికి రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా దసరాకే వస్తుందన్న ఓ గాసిప్ గట్టిగా వినిపించింది. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలి. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల వాయిదా పడబోతోంది. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. మే – జూన్లో రావొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్రబృందం మాత్రం దసరా బరిలో ఈ సినిమాని నిలపాలని భావిస్తున్నారని టాక్. కాకపోతే ఇక్కడో లిటికేషన్ వుంది. ‘ఫౌజీ’ మైత్రీ మూవీస్ బ్యానర్లో రూపుదిద్దుకొంటుంది. అదే మైత్రీ మూవీస్ ‘పెద్ది’ నిర్మాణంలోనూ భాగం పంచుకొంది. అంటే దాదాపుగా ఈ రెండు సినిమాలూ మైత్రీ మూవీస్ బ్యానర్లోనే రూపుదిద్దుకొంటున్నాయనుకోవొచ్చు. ఒకే బ్యానర్, ఒకే సీజన్లో రెండు సినిమాల్ని తీసుకురావడం దాదాపు అసాధ్యం. సంక్రాంతి సీజన్లో ఇది వరకు మైత్రీ మూవీస్ రెండు సినిమాల్ని రిలీజ్ చేసింది. దిల్ రాజు బ్యానర్ లోంచి కూడా రెండు సినిమాలొచ్చాయి. సంక్రాంతి కాబట్టి.. అప్పుడు పెద్దగా ఇబ్బంది రాలేదు. దసరా అలా కాదు. ఒకే సీజన్లో రెండు పెద్ద సినిమాలు, ఒకే నిర్మాణ సంస్థ నుంచి వచ్చే అవకాశాలు దాదాపు లేవు. కాబట్టి ఫౌజీ లేదా పెద్ది మాత్రమే దసరా బరిలో నిలుస్తుంది. మిగిలిన సినిమాకు మరో మంచి రిలీజ్ డేట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. షూటింగ్ పరంగా చూస్తే.. ఫౌజీ కంటే పెద్దినే ముందు ఉంది. ఫౌజీ కంటే పెద్దినే ముందుగా షూటింగ్ పూర్తి చేసుకొంటుంది. జూన్ లేదా జులైలో పెద్దిని రిలీజ్ చేస్తే.. ఫౌజీ కి కావాల్సినంత టైమ్ ఉంటుంది. ‘పెద్ది’ బ్యాలెన్స్ షూట్ ఎంత వుంది? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏ మేరకు చేయాలి? అనే విషయాల్ని బట్టి రిలీజ్ డేట్ నిర్ణయిస్తారు. ఈ విషయంలో మైత్రీ మూవీస్ త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది.