తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దిరెడ్డి సోదరుడు ఇలాకా. అక్కడ టీడీపీ నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేయడం అంటే అసాధ్యం. అది వారిడెన్. అక్కడ కుటీర పరిశ్రమ పెట్టేశారంటే ఖచ్చితంగా అది పెద్దిరెడ్డి కుటుంబీకుల అక్రమ వ్యాపారమే. ఇప్పుడు విచారణలో అవే విషయాలు బయటకు వస్తున్నాయని తెలియడంతో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మరోసారి భయం పట్టుకుంది. ఆ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఆయన అమిత్ షాకు లేఖ రాశారు.
రాజంపేట పరిధిలోకి వచ్చే తంబళ్లపల్లిలో కల్తీ మద్యం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. ములకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడింది. ఏపీలో ఆరు నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ డంప్ సీజ్ చేశారని చెప్పుకొచ్చారు. కేసు సీబీఐకి పోతే ..బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని అయినా ప్రశాంతంగా ఉండవచ్చని మిథున్ రెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ కల్తీ ముఠాను పట్టుకోవడం ద్వారా ఆఫ్రికా లింకులు వెలుగులోకి వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే మిథున్ రెడ్డి కంగారు పడుతున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ మద్యాన్ని వైసీపీ హయాంలో ఎంత భారీగా అమ్మారన్నది ఎక్సైజ్ పోలీసులు తేల్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబం బయటపడటం కష్టమన్న వాదన వినిపిస్తోంది.