ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది.
పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 72 గంటల సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లో అనుమతులను జారీ చేస్తారు. అర్బన్ లోకల్ బాడీస్ , అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వద్ద ఎలాంటి జాప్యం లేకుండా చేస్తారు. హై-రైజ్ భవన ప్రతిపాదన సమర్పించిన వెంటనే, DTCP, సంబంధిత కమిషనర్/వైస్-ఛైర్పర్సన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్‌కు ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్తుంది. కమిషనర్ , టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్ 36 గంటల్లో సైట్‌ను సందర్శించి అనుమతుల ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్లానింగ్ సెక్షన్ హెడ్ DTCP కార్యాలయంలో స్క్రూటినీ కమిటీ సమావేశంలో పాల్గొని, 72 గంటల్లో అనుమతులను ఖరారు చేస్తారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఒకే విధానంలో అనుమతులు లభించేలా సులభతరం చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచవచ్చని ప్రభుత్వం నమ్ముతోంది.