ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా వైసీపీ నేతలు మళ్లీ తమ నోటి దూల చూపించడానికి వెనుకాడటం లేదు. మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై దారుణమైన భాషను ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు మరణం గురించి, చంద్రబాబు పోయాక ఆయన విగ్రహం పెట్టేవాడు కూడా ఉండడటూ అంటూ నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఉండాల్సిన కనీస నైతికతను తుంగలో తొక్కాయి.
విగ్రహాల రాజకీయమా.. సేవా తత్పరతా?
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం వారి ఇష్టం. కానీ, రాష్ట్రవ్యాప్తంగా డబ్బులిచ్చి ఊరూరా విగ్రహాలు పెట్టించుకున్న సంస్కృతి ఎవరిదో ప్రజలందరికీ తెలుసు. కేవలం విగ్రహాలు ఉంటేనే నాయకుడు జీవించి ఉంటాడనుకోవడం భ్రమ. ప్రజా హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్, చంద్రబాబు వంటి నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే.. సూర్యుడిపై ఉమ్మి వేయడమే. తిడితేనే దగ్గరకు రానిచ్చే, ఊడిగం చేస్తేనే పదవులిచ్చే నాయకత్వం కింద పని చేసే వ్యక్తుల నుంచి ఇంతకంటే మెరుగైన మాటలు ఆశించడం కూడా తప్పే.
నైతికత లేని రాజకీయ విమర్శలు
రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అవే బూతులు, అదే అహంకారం ప్రదర్శించడం జుగుప్సాకరం. తిరుమల లడ్డూ వంటి పవిత్రమైన అంశాలపై కూడా నాలుకలు కోయాలి, వాతలు పెట్టాలి అంటూ పేర్ని నాని వాడిన భాష ఆయన సంస్కారాన్ని ప్రతిబింబిస్తోంది. కేవలం రాజకీయ ఉనికి కోసమో, తన అధినేత మెప్పు కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థే కలుషితమవుతోంది. తిరుమల లడ్డూలో అసలు నెయ్యే వాడని వారికి ఎలాంటి శిక్ష వేయాలి!
ఏం సాధిస్తారు..?
నేతలు తమ నోటి దురుసును తగ్గించుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింత ఘోరమైన తీర్పునిస్తారు. అధికారం పోయినా అహంకారం తగ్గని ఇలాంటి వ్యక్తులకు కేసులు మాత్రమే సరిపోవు. ప్రజాక్షేత్రంలో వారిని బహిష్కరించడమే సరైన సమాధానం. అభివృద్ధి గురించి మాట్లాడటం చేతకాక, మరణాల గురించి, శవాల గురించి మాట్లాడే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఇక సాగవని వైఎస్సార్సీపీ నేతలు తెలుసుకోవాలి. చట్ట ప్రకారం కేసులు నమోదవుతున్నా పోయేదేం లేదు అన్నట్లుగా వ్యవహరించడం వ్యవస్థల పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే ఇలాంటి నేతలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాజకీయాల్లో కనీస గౌరవం, మర్యాద నిలబడతాయి.
