ఎన్నికల టైంలో ఇదిగో కేంద్ర నిఘా వర్గాల సర్వే అంటూ.. సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు కొన్ని సర్వేలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దీనికి కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి రా అనే పేరు వరకూ ఎన్ని విభాగాల వాళ్లకు తెలిస్తే అన్ని పేర్లనూ వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పేర్ని నాని కూడా అదే రేంజ్ కు వెళ్లిపోయారు.
ఉగాది తర్వాత ఏపీలో నారా లోకేష్ సీఎం అవబోతున్నారట. ఈ విషయంపైనే ఇటీవల పవన్ కల్యాణ్, చంద్రబాబు చర్చించుకున్నారని పేర్ని నాని చెబుతున్నారు. తన కుమారుడితో కలిసి పని చేయాలని చంద్రబాబు చెప్పారట. లేకపోతే ఇద్దరం కలిసి కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందని కూడా చెప్పారని అంటున్నారు. ఈ సమాచారం ఎలా తెలిసిందన్న డౌట్ అందరికీ వస్తుంది … పైగా పేర్ని నాని ఎప్పట్లాగేస సాక్షి తరహా కథల్ని చెబుతున్నారని అనుకుంటారు. అందుకే తమ సోషల్ మీడియా టీం చేసే విన్యాసాలను ఇక్కడ చేశారు. ఎవరు చెప్పారంటే. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. మిగతా సమాచారం ఎలా ఉన్నా.. పేర్ని నాని చెప్పిన ఈ నిఘా వర్గాల సమచారం వినే సరికి జర్నలిస్టులు కూడా జేబుల్లో చేతులు పెట్టుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది.
నారా లోకేష్ సీఎం అవుతారన్న ప్రచారాన్ని వైసీపీ నేతలే చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ ను అాదానీదని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ అంశంలోనూ అదే పనిగా లోకేష్ సీఎం అని ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒక రోజు లోకేష్ సీఎం అవుతారని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నట్లుగా వారి ప్రచారం ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
