పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టారు. ఏపీ బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టారా అంటూ ఆవేశపడ్డారు. టీడీపీ ఇచ్చిన స్క్రిప్టుతోనే మాధవ్, పురందేశ్వరి సహా అందరూ ట్వీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. పేర్నికి ఏపీ బీజేపీ నేతలపై ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు కోపం వచ్చిందంటే.. ఇటీవల వైఎస్ చనిపోయిన రోజు సంబరాల్లో భాగంగా వినాయక మండపంలో చికెన్ బిర్యానీలు పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
దీంతో ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన హిందూ ఆలయాలపై జరిగిన దాడులన్నింటినీ గుర్తు చేస్తూ… ఇవన్నీ ఎలా మర్చిపోతామని.. హిందూ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీని తరిమికొడతామని ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లు పెట్టి కూడా వారం రోజులు అయిపోతోంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయాలి కాబట్టి ఆగినట్లుగా ఉన్నారు. అందరూ మర్చిపోయాక పేర్ని నాని ప్రెస్మీట్ పెట్టి.. టీడీపీ , బీజేపీ అని రెచ్చిపోయారు. బీజేపీని టీడీపీకి అద్దెకివ్వాల్సిన పని లేదు. వారేమీ వైసీపీ మిత్రపక్షం కాదు. ఆ విషయం పేర్ని నానికి అర్థం కావడం లేదు.
బీజేపీ అడగకపోయినా మద్దతుగా ఉంటోంది వైసీపీనే. వారేమీ వైసీపీతో పొత్తులు పెట్టుకోవాలని అనుకోవడం లేదు. కానీ మోదీ కాళ్లు వదిలేస్తే తాము నేరుగా వెళ్లి జైల్లోపడతామని వారికి తెలుసు. అందుకే వదలడం లేదు. తాము అడగకపోయినా మద్దతుగా ఉంటున్నాం కాబట్టి..తమపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేయకూడదని… అలా చేస్తే టీడీపీకి బీజేపీని అద్దెకిచ్చినట్లేనని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడే ఏముంది.. ఏపీ బీజేపీ నేతలు అసలు సినిమా..వైసీపీకి ముందు ముందు చూపిస్తారన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.