తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ అసలు ఆ ఆంశంపై మాట్లాడకుండా చేయాలని వైసీపీ వేసిన ప్లాన్ రివర్స్ అయింది. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఈరోజు తోసిపుచ్చింది. గత కొంతకాలంగా ఈ అంశం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసుపై సిబిఐ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరుగుతున్నందున, ప్రస్తుతం తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ వివాదంపై ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని కోరుతూ మనుర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సిబిఐ కేవలం కల్తీ అంశాన్నే చూస్తుంది తప్ప, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను అడ్డుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజనం కంటే నిందితుల వాదనను సమర్థించే ప్రయత్నంలా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఈ కేసును ఒక స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేస్తోందని, విచారణ పెండింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి పిటిషన్లను తాము ప్రోత్సహించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో కోర్టు జోక్యం అవసరం లేదని భావిస్తూ, ఈ పిటిషన్ను విచారించదగినది కాదని ధర్మాసనం డిస్మిస్ చేసింది. దీంతో ఈ అంశంపై ఎవరూ మాట్లాడకుండా చేయాలనుకున్న వైసీపీ కుట్రలు తేలిపోయాయి.
