రివ్యూ: పేట

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

దినుసుల‌న్నీ ముందు పెట్టుకుంటే స‌రిపోదు. వాటిని వండి వార్చే నేర్పు వంట‌గాడికి తెలిసుండాలి.

`ప్రేమ‌తో వండాలి`. అప్పుడే వంట‌కు రుచి వ‌స్తుంది. ఎలాగూ ఇన్ని దినుసులు ఉన్నాయి క‌దా, రుచి దానంత‌ట అదే వ‌స్తుందిలే అనుకుంటే న‌ల‌భీముల వంటైనా… చేదెక్కిపోతుంది.

సూప‌ర్ స్టార్ ఉన్నాడు..సిమ్ర‌న్ ఉంది.. త్రిష వ‌చ్చింది..విజ‌య్ సేతుప‌తి…న‌వాజుద్దీన్‌, అనిరుథ్‌… ఓ పేర్లు వింటేనే క‌డుపు నిండిపోతుంది.అయితే కార్తీక్ సుబ్బ‌రాజుకి మ‌రో బ‌ల‌మైన ఆయుధం కావాలి. ఈ పువ్వుల‌న్నీ క‌ల‌సి క‌ట్టుగా ఉండాలంటే ఓ దారం కావాలి.. అది `పేట`కి కుదిరిందా? ఇన్ని ప‌దార్థాలు ఎదురుగా పెట్టుకున్న కార్తీక్ సుబ్బ‌రాజు న‌ల‌భీముల్ని త‌ల‌పించాడా? లేదంటే కేవ‌లం దినుసుల‌నే న‌మ్ముకున్నాడా?

క‌థ‌

అదో హాస్ట‌ల్‌. అక్క‌డ ఓ గ్యాంగ్ చేసే అల్ల‌రికి అంతే ఉండ‌దు. ర్యాగింగ్ పేరుతో జూనియ‌ర్ల‌ని ఆడేసుకుంటుంటారు. ఆ హాస్ట‌ల్‌కి ఏరి కోరి, గ‌ట్టి రిక‌మెండేష‌న్‌తో వార్డెన్‌గా అడుగు పెడ‌తాడు కాళి (ర‌జ‌నీకాంత్‌). జూనియ‌ర్ల‌ని ఏడిపిస్తున్న గ్యాంగ్ ఆట క‌ట్టిస్తాడు. ఓ ప్రేమ జంట‌ని క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తాడు. హాస్ట‌ల్‌ని ఓ దారికి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇంతలో ఓ ముఠా హాస్ట‌ల్‌పై దాడి చేస్తుంది. ఆ స‌మ‌యంలోనే కాళి అస‌లు పేరు పేట అని తెలుస్తుంది. పేట కాళిగా ఎందుకు మారాడు? పేట గ‌తం ఏమిటి? ఎక్క‌డో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో ఉంటున్న సింహాచ‌లం (న‌వాజుద్దీన్ సిద్దిఖీ)కీ త‌న కొడుకు జిత్తు (విజ‌య్ సేతుప‌తి)కీ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే `పేట` క‌థ‌..

విశ్లేష‌ణ‌

కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌లు గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. ట్విస్టులు, ట‌ర్న్‌ల‌తో ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌మైన ముద్ర వేయ‌డానికి కార‌ణం అదే. అయితే.. ఆ షార్ప్ నెస్ ఈ సినిమాలో ఎక్క‌డా క‌నిపించ‌దు. ర‌జ‌నీ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకునే క‌థ‌ని రాసుకోవాలా? లేదంటే త‌న ముద్ర చూపించాలా? అనే సందిగ్థంలో… రెండింటికీ న్యాయం చేయ‌లేదేమో అనిపిస్తుంది. హాస్ట‌ల్ వార్డెన్‌గా ర‌జ‌నీని రంగ ప్ర‌వేశం చేయించాడు. అక్క‌డ‌.. ర‌జ‌నీ తాలుకూ స్టైల్‌, హీరోయిజం చూపించే అవ‌కాశం ద‌క్కింది. దాన్ని కొంత వ‌ర‌కూ వాడుకోగ‌లిగాడు కూడా. అయితే అవేం ర‌జ‌నీ అభిమానుల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. ప్ర‌తీ స‌న్నివేశం నిదానంగానే సాగుతుంది. తెర‌పై ర‌జ‌నీ క‌నిపిస్తున్నాడు కాబ్టి, అది కార్తీక్ సుబ్బ‌రాజు సినిమా కాబ‌ట్టి.. ఓపిగ్గా భ‌రిస్తుంటాడు ప్రేక్ష‌కుడు. తొలి అర్థ భాగాన్ని కేవ‌లం ర‌జనీ ఎలివేష‌న్ల కోసం. స్టైల్ కోసం చిలిపిద‌నం కోసం వాడుకున్నాడు. ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్‌మొద‌ల‌వుతుంది. అది 1980ల నాటి క‌థ‌. ఫ్లాష్ బ్యాక్‌లో పేటగా మెరుపులు చూడొచ్చు అనుకుంటే.. అది కాస్త తుస్సుమంది. పైగా త‌మిళ వాస‌న‌. అది పూర్త‌వ్వ‌గానే శ‌త్రు సంహారం కోసం ర‌జ‌నీ రంగంలోకి దిగుతాడు. ఇక్క‌డ కార్తీక్ సుబ్బ‌రాజు త‌న స్టైల్‌ని చూపిద్దామ‌నుకున్నాడు. ఓ ట్విస్ట్ ఇచ్చి.. త‌న ముద్ర వేద్దామ‌నుకున్నాడు. కానీ అప్ప‌టికే చాలా ఆల‌స్యం అయిపోతుంది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుడు ఓ అంచ‌నాకు వ‌చ్చేస్తాడు. సీట్లోంచి లేచి వెళ్లిపోదామ‌నుకున్న ప్రేక్ష‌కుడ్ని… ఆ మ‌లుపు కూడా ఆప‌లేక‌పోయింది.

ర‌జ‌నీలాంటి స్టార్ దొరికితే.. దానికి అండ‌గా.. బ‌ల‌మైన తారాగ‌ణం, సాంకేతిక నిపుణులు తోడైతే… కార్తీక్ సుబ్బ‌రాజు దాన్ని స‌రిగా వాడుకోలేద‌నిపిస్తుంది. సినిమా మొత్తంలో అర‌వై స‌న్నివేశాలున్న‌ప్పుడు అందులో క‌నీసం ప‌ది స‌న్నివేశాలైనా మెర‌వాలి. లేదంటే… ఇలాంటి ప్ర‌య‌త్నాలు ఏమాత్రం ర‌క్తి క‌ట్ట‌వు. అక్క‌డ‌క్క‌డ ర‌జ‌నీ తాలుకూ మేన‌రిజంతో… ఓ స‌గ‌టు క‌థ‌ని నెట్టుకురావాల‌న్న ప్ర‌య‌త్నం మాత్రం హ‌ర్షించ‌ద‌గిన‌ది కాదు. ఇంట్ర‌వెల్ ముందు ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంది. అందుకు జ‌రిగిన ప్రిప‌రేష‌న్ చూస్తే.. ఇక్క‌డేదో అద్భుతం జ‌ర‌గ‌బోతోంద‌న్న బిల్డ‌ప్ క‌నిపిస్తుంది. ఓ ఫైట్ సీన్‌కి దాదాపు 5 నిమిషాల లీడ్ తీసుకుంటాడు ద‌ర్శ‌కుడు. తీరా చూస్తే… `రండిరా కొట్టుకుందాం` అన్న టైప్‌లోనే ఆ ఫైట్ ఉంటుంది. ఇలాంటి టైమ్ పాస్ వ్య‌వ‌హారాలు ఈ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. ర‌జ‌నీ ఫైర్‌ని వాడుకునే తెలివితేట‌లు ద‌ర్శ‌కుడికి ఉండాలి. దాన్ని స‌రిగా వాడుకుంటే ఆ ఫైర్ దీపంగా మారుతుంది. లేదంటే.. సినిమా మొత్తాన్ని త‌ల‌గ‌ల‌బెట్టేస్తుంది.

న‌టీన‌టులు

ర‌జ‌నీకాంత్ కుర్రాళ్ల‌లో కుర్రాడిగా క‌ల‌సిపోయాడు. త‌న చిలిపిద‌నం ఆక‌ట్టుకుంటుంది. డ్ర‌స్సింగ్ స్టైల్ బాగుంది. కానీ మేక‌ప్ ఆక‌ట్టుకోదు. త‌న ముస‌లిత‌నం ఛాయ‌లు మేక‌ప్‌తో దాచ‌లేక‌పోయాడు. సిమ్ర‌న్‌, త్రిష‌.. ఇద్ద‌రి ట్రాకులూ వేస్టే. అస‌లు వీరిద్ద‌రినీ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాదు. త్రిష‌కు ఒక‌టో రెండో డైలాగులు ఇచ్చారంతే. మేఘా ఆకాష్ .. నేను ర‌జ‌నీ సినిమాలో న‌టించాను అని చెప్పుకోవ‌డానికి త‌ప్ప‌.. ఆమెకు ఈ సినిమా ఏ ర‌కంగానూ ఉప‌యోగ‌ప‌డ‌దు. విజ‌య్ సేతుప‌తి పాత్ర బాగానే ఉన్నా.. త‌న స్థాయికి త‌గిన పాత్ర మాత్రం కాదిది. న‌వాజుద్దీన్ వ్య‌వ‌హారం కూడా అంతే. ఇంత‌మంది స్టార్ల‌ను పెట్టుకున్నా.. వెలుగుల్లేవంటే దానికి కార‌ణం.. స‌రైన క‌థ లేక‌పోవ‌డ‌మే.

సాంకేతిక వ‌ర్గం

అనిరుథ్ ఒక్క‌డే త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. బీజియ‌మ్స్ తో హుషారు తెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో ఉన్న ఊపు తెర‌పై క‌నిపించ‌దు. ఆర్ట్ వ‌ర్క్‌, కెమెరా అన్నీ బాగున్నాయి. పాట‌లూ ఓకే అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా కార్తీక్ త‌న పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌లేక‌పోయాడు. ఓ ట్విస్టుని న‌మ్ముకుని రాసుకున్న క‌థ ఇది. అయితే ఆ ట్విస్ట్ వ‌చ్చేట‌ప్ప‌టికే.. నీర‌సాలు ముంచుకొచ్చేస్తాయ్‌

తీర్పు

ర‌జ‌నీ ఉంటే స‌రిపోదు. ర‌జ‌నీని నిల‌బెట్టే ద‌మ్మున్న క‌థ‌లు రాసుకోవాలి. బ‌ల‌హీన‌మైన క‌థ‌ని నెట్టుకురాగ‌లిగే స‌త్తా ఏ స్టార్‌కీ లేద‌ని ఈసినిమా నిరూపిస్తుంది.

ఫైన‌ల్ ట‌చ్‌: బ‌హు ప‌రాక్‌

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com