తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం సిట్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత సిట్ ను నియమించడం ఓ వింత అయితే ఆ సిట్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను చీఫ్‌గా నియమించడం మరో విశేషంగా మారింది. ఎందుకంటే పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సజ్జనార్ పోలీసు శాఖలోనే అత్యంత కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దల రాజకీయ వ్యూహాల అమల్లో భాగమయ్యారు. ఆయనకు తెలియకుండా ఏదీ జరిగి ఉండదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన చేతికే సిట్ ను అప్పగించడం ఆసక్తి రేపుతోంది.
దర్యాప్తూ ఎటూ తేలక సిట్‌కు అప్పగించారా?
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటలిజెన్స్ నుంచి ముఖ్యమైన సమాచారం ధ్వంసం అయిందని తెలుసుకుని కేసు పెట్టారు. ఆ కేసు దర్యాప్తులో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశాన్న విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరుగుతోంది. ఏ 1 ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడానికి సతాయించారు. చివరికి అరెస్టు నుంచి ఊరట పొందిన తర్వాతనే వచ్చారు. వచ్చాక విచారణకు సహకరించడం లేదు. ఆయన పోలీసు ఉన్నతాధికారిగా చేశారు కాబట్టి .. ఏం చేయాలో.. ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే కేసు ముందుకు కదలకపోవడంతో సిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దర్యాప్తు దాదాపుగా పూర్తి – కొత్త సిట్ ఏం చేస్తుంది?
ఇరవై నెలలుగా ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఎన్ని ఫోన్లను ట్యాప్ చేసి..ఏ ఏ ఆడియోలను రికార్డు చేశారో.. ఎవరవరిపై కుట్రలు కన్నారో.. ఎవరి దగ్గర వసూళ్లకు పాల్పడ్డారో మొత్తం రికార్డు ఉంది. కానీ అవి ఫోన్ ట్యాపింగ్ చేసే రికార్డు చేశారన్నదానికి సాక్ష్యం కనిపించడం లేదు. ఫోన్ ట్యాపింగ్ పరికరాల దగ్గర నుంచి ఇతర టెక్నికల్ అంశాలను నిరూపించడం వారికి సవాల్ గా మారింది. ప్రభాకర్ రావు తన క్లౌడ్ స్టోరేజీని క్లియర్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జనార్ సిట్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
సజ్జనార్ అంటే అంత నమ్మకమా? టెస్టు పెడుతున్నారా?
వీసీ సజ్జనార్ గురించి పోలీసు వర్గాల్లో విచిత్రమైన చర్చ జరుగుతుంది. ఆయన పబ్లిసిటీకి అలవాటు పడిన పోలీస్ ఆఫీసర్ అని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని మెప్పించి కీలక పోస్టులు పొందడంలో సిద్ధహస్తుడని చెబుతారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్, కేటీఆర్ రాజకీయ వ్యూహాలు అమలకు పోలీసు విభాగం నుంచి సాయం కావాలంటే చేయడంలో ఆయనది కీలక పాత్ర అని అందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియకుండా ఉండదు. అయినా ఆయనను సిట్ చీఫ్ గా నియమించారంటే అంత నమ్మకం రేవంత్ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని లేకపోతే ఆయన కు టెస్టు పెడుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే సజ్జనార్‌కూ ఈ కేసు కాస్త సవాల్ తో కూడుకున్నదే.
